సాక్షి టాస్క్ ఫోర్స్: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతలు గూండాగిరి చేస్తున్నారు. ఏకంగా నామినేషన్ కేంద్రంలోనే అభ్యర్థులను నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. ఈ సంఘటన కొండపిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కొండపి మండలం వెన్నూరు ప్రాదేశికానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పూనాటి శ్రీను నామినేషన్ వేసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడే వేచి ఉన్న టీడీపీ గూండాలు పూనాటి శ్రీను చేతుల్లోని నామినేషన్ పత్రాలు లాక్కెళ్లారు. నామినేషన్ కేంద్రంలోకి టీడీపీ గూండాలు వచ్చి పేపర్లు లాక్కెళుతుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని స్థానికంగా చర్చ సాగుతోంది. అభ్యర్థుల చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య
మార్కాపురం టౌన్: పట్టణంలోని నాగులవరం రోడ్డులో ఉంటూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పోతిరెడ్డి రవీంద్రారెడ్డి (34) ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రవీంద్రారెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివసిస్తున్నాడు. బెంగుళూరులో ఇంటిని కూడా కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో బంధువులతో పాటు పాటు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అయితే వాటిని చెల్లించాలని కొంతకాలంగా ఒత్తిడి రావడంతో ఒత్తిడిని తట్టుకోలేక కొనుగోలు చేసిన ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని కుటుంబ సభ్యులకు తెలిపినట్టు సమాచారం. ఈ క్రమంలో మనస్తాపంతో లాడ్జిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పట్టణ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు
ఒంగోలు సబర్బన్:
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది తమ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని, అలా కాకుండా ఇష్టారీతిన చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ పి.రాజాబాబు హెచ్చరించారు. ఆర్‌వోలు, వివిధ విభాగాల నోడల్ ఆఫీసర్లతో గురువారం ఆయన టెలికాన్ఫరెనన్స్ నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు శుక్రవారం కూడా నామినేషన్లు ప్రక్రియ ఉన్నందున నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు లోబడి నామినేషన్ వేసే వారితో పాటు ఇద్దరినీ అనుమతించాలని, నిర్ణీత గడువు లోగా ఉన్న వారిని నామినేషన్ వేసే లాగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, బ్యాలెట్ బాక్స్‌ల భద్రత, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రి సమకూర్చుకోవడంలో జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీఎస్‌టీవీవీవీ బృందాలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.


