● యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజం
యర్రగొండపాలెం:
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడులు చేయిస్తోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా వరుసగా రెండో రోజు గురువారం పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీకి చెందిన వ్యక్తులు రాళ్లు, కర్రలతో మోహరించి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరోవైపు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి, తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. యర్రగొండపాలెం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీకి చెందిన వ్యక్తి కర్రతో దాడికి దిగిన ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వ్యక్తికి ఎంపీపీ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను అడ్డుపెట్టుకొని రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలిచే అవకాశం లేదనే భయంతోనే దాడులకు దిగి నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రశేఖర్ విమర్శించారు. రౌడీలను తీసుకొచ్చి దాడులు చేయించినంత మాత్రాన వారు హీరోలు కాలేరని, జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం సీఐలు, ఎస్సైలు టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ వేసేందుకు వెళితే అక్కడ దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తుచేశారు. టీడీపీకి మెజారిటీ ఉన్న గ్రామాల్లో తమ పార్టీ జోక్యం చేసుకోలేదని, దౌర్జన్యాలకు పాల్పడి ఆ గ్రామాలను తమ ఖాతాలో వేసుకునే రాజకీయాలకు తమ పార్టీ ఎప్పుడూ పాల్పడలేదని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


