నామినేషన్లు వద్దంటే ఎన్నికలెందుకు..? | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లు వద్దంటే ఎన్నికలెందుకు..?

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

నామినేషన్లు వద్దంటే ఎన్నికలెందుకు..?

అధికారాన్ని అడ్డం పెట్టుకొని నామినేషన్లను అడ్డుకోవడం దారుణం అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

కొండపి: వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటూనే ఉన్నారని, అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న విధానంపై స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నూతన విధానాన్ని ప్రభుత్వం పోలీసులు సహకారంతో నెలకొల్పిందన్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున వెన్నూరు నుంచి నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళితే అప్పటికే వేచి ఉన్న టీడీపీ వ్యక్తులు నామినేషన్‌ పత్రాలు చించివేశారన్నారు. పొన్నలూరు, మర్రిపూడి మండలాల్లో పోలీసులు పచ్చ చొక్కాలు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొన్ని ప్రాంతాల్లో నామినేషన్లు వేయనీయిస్తున్నా పరిశీలనలో ఎన్ని తిరస్కస్తారో, ఎన్ని ప్రాదేశికాల్లో ఎన్నికలు నిర్వహిస్తారో వారికే తెలుసన్నారు. టీడీపీ నాయకులు గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారని, పోలీసులు వారిని అడ్డుకోకుండా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నా ఏకపక్ష ధోరణితో పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో మీ అభ్యర్థుల నామినేషన్‌ వేసుకొని మీరే పోటీలో ఉండి మీరే గెలిచినట్లు ప్రకటించుకోవచ్చు కదా అని మంత్రిపై మండిపడ్డారు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలో ఎన్నికల తీరుపై కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరతామన్నారు. మండల కన్వీనర్‌ బచ్చల కోటేశ్వరరావు, గొట్టిపాటి మురళి, ఆరికట్ల కోటిలింగయ్య, బొక్కిసం సుబ్బారావు, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి,వేముల రమేష్‌, మండవ మాల కొండయ్య, చింతల వెంకటేశ్వర్లు, శ్రీను, సుధాకర్‌, ప్రసాద్‌, నారాయణ, వేముల ప్రసాద్‌, కోటరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement