ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

● కలెక్టర్‌ విజయ సునీత

మార్కాపురం: జిల్లా పరిధిలో ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం విజయసునీత స్పష్టంచేశారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్సు హాలులో ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు సీహెచ్‌ శ్రీధర్‌కు జిల్లాలోని ఎన్నికల సన్నాహాలను కలెక్టర్‌ వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన ఎన్నికల సిబ్బందిని కేటాయించామని, బ్యాలెట్‌ పెట్టెల లభ్యత, వాటి పనితీరు, భద్రతను తనిఖీ చేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, ఓటు వేయడానికి వచ్చే ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం టెంట్లు, ర్యాంప్‌ వసతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి..

జిల్లా పరిధిలోని సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ అదనపు పోలీస్‌ బలగాలు, వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, నిరంతర సీసీటీవీ నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు స్పందించి తక్షణ పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు సీహెచ్‌ శ్రీధర్‌ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా సజావుగా సాగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. జాయింట్‌ కలెక్టర్‌ పి. శ్రీనివాసులు, ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా, ఓఎస్డీ (అడ్మిన్‌) నవజ్యోతి మిశ్రా, డీఆర్‌ఓ శ్రీదేవి, డీపీఓ కుప్పిలి ఫణీంద్ర, మార్కాపురం మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కంచి బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement