● ఎన్నికల పరిశీలకురాలు హెబ్సిబా రాణి
ఒంగోలు సబర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి హెబ్సిబా రాణి సూచించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన అన్ని విభాగాల నోడల్ అధికారులతో ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్సు హాలులో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక అవసరమన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు అవగాహన చేసుకుని, పక్కాగా అమలు చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు జరుగుతుంటే వాటిని తక్షణమే అరికట్టాలన్నారు. నిబంధనలు, నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘన జరగకుండా అధికారులంతా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. మీ సామర్థ్యాలను రుజువు చేసుకునే గొప్ప సమయంగా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చులపై క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పి.వివేక్ చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన ప్రతి అంశాన్ని దస్త్రాల్లో నమోదు చేయాలని, ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకాశం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ, అద్దంకి, చీమకుర్తి, దర్శి నగరపాలక సంస్థల్లోని 150 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపొందించామన్నారు. సమస్యాత్మక, తీవ్రసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. 12 చెక్ పోస్టులు, 11 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 13 ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. దర్శి మున్సిపాలిటీలో అదనపు బలగాలను నియమించినట్లు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమర్ధంగా నిర్వహించడానికి సూక్ష్మ ప్రణాళిక ఉండాలని జిల్లా జాయింట్‌క కలెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు. జిల్లా రెవిన్యూ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


