వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా దాడులు నరసరావుపేట ప్రాంతం నుంచి వచ్చిన 200 మందికిపైగా గూండాలు నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లి మరీ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేసిన కడియాల రమేష్, కర్ణ శ్రీను పోలీసుల ప్రేక్షక పాత్రపై విమర్శల వెల్లువ అడిషనల్ ఎస్పీ, సీఐల తీరుపై ఆరోపణలు చివరిరోజైనా వేయిస్తారా? అంటూ అనుమానాలు
ఖాకీల సాక్షిగా..
దర్శిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో టీడీపీ మూకల హల్‌చల్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో శనివారం జరిగిన టీడీపీ అరాచకపర్వానికి పోలీసులదే కీలకపాత్ర అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్శి మున్సిపల్ ఎన్నికల శాంతిభద్రతల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఏఎస్పీ యుగంధర్‌బాబు నేతృత్వంలో గూండాగిరికి వ్యూహరచన చేశారని, టీడీపీ గూండాలను దగ్గరుండి పోలీసులే ప్రోత్సహిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులపై తెగబడేలా ఏఎస్పీ కనుసన్నల్లోనే దాడులను ప్రోత్సహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక డీఎస్పీ, ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 30 మంది కానిస్టేబుళ్లు నామినేషన్ కేంద్రం వద్ద విధుల్లో ఉన్నాగానీ.. ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నా అక్కడే ఉన్న పోలీసులు కనీసం వారించలేదు. అదే సందర్భంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలను లాక్కుని మరీ చించివేస్తుంటే పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధానంగా దర్శి మున్సిపాలిటీలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న ఏఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ నాగమల్లేశ్వరరావులే దగ్గరుండి మరీ దాడులను ప్రోత్సహించారని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా శనివారం ఐదుగురు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారని, వారి వద్ద స్లిప్పులు కూడా ఉన్నాయని, అయితే ఆన్‌లైన్‌లో మూడు నామినేషన్‌లే చూయిస్తున్నారని, మిగతా రెండు నామినేషన్‌లు ఏమయ్యాయో తెలియడం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
పల్నాడు పచ్చమూకల దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండతో దర్శి అట్టుడికిపోయింది. నామినేషన్ల దశ నుంచే జంగిల్ రాజ్యాన్ని తలపించే పరిస్థితులు పట్టణంలో నెలకొన్నాయి. పొరుగుప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది పోలీసుల సమక్షంలోనే భయానక వాతావరణాన్ని సృష్టించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడంతో పాటు నామినేషన్ పత్రాలను చించివేస్తూ పేట్రేగిపోయారు. ప్రజాస్వామాన్ని అపహాస్యం చేసే విధంగా పచ్చగూండాలు వ్యవహరించారు. శనివారం దర్శి పట్టణంలో జరిగిన దౌర్జన్యకాండ అడుగడుగునా పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మార్కాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా డాక్టర్ చప్పలి కనకదుర్గను ఎంపికచేసినట్టు పార్టీ కేంద్రకార్యాలయం తెలిపింది. డాక్టర్ వృత్తితో పాటు మార్కాపురం తాజామాజీ కౌన్సిలర్. శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు మెంబర్‌గా పనిచేశారు. మార్కాపురం రెడ్‌క్రాస్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పట్టణంలోన్ని అన్ని వర్గాల వారితో మంచి సంబధాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ ఒంగోలు మేయర్ అభ్యర్థిగా నల్లమల్లి శ్రీశిల్ప, చీమకుర్తి నగరపంచాయతీకి శిద్దా సుధాకర్, కనిగిరికి అచ్చాల తిరుపతమ్మను అభ్యర్థులుగా ప్రకటించింది. దర్శి, గిద్దలూరుకు జనసేన, బీజేపీలు ప్రకటించాల్సి ఉంది.
మార్కాపురం టౌన్: స్థానిక కలెక్టరేట్‌లో ఈ నెల 19వ తేదీ జరగాల్సిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ విజయసునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహర్ణవమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిందనందున పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న దర్శి పట్టణంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల నామినేషన్లు వేయకుండా పల్నాడు ప్రాంతం నుంచి వచ్చిన వందలాది మంది అలజడి సృషించారు. ఓ పథకం ప్రకారం నామినేషన్ కేంద్రం వద్ద దారికాచి దాడులకు తెగబడ్డారు. సార్వత్రిక ఎన్నికల నుంచే పట్టణంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో, ఎన్నికలైన తర్వాత కూడా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్న అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. నియోజకవర్గంలో యథేచ్ఛగా సహజసంపదను కొల్లగొడుతున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.
అంతా పథకం ప్రకారమే...
పురపోరుకు సంబంధించి శుక్రవారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం పెద్ద ఎత్తున నామినేషన్‌లు వేసేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. వీరిలో దర్శి మున్సిపల్ చైర్మన్ వెన్నపూస వెంకట్‌రెడ్డి, మేడం మోహన్‌రెడ్డితో పాటు 3వ వార్డు నుంచి వెదురు మణికంఠారెడ్డి, 9వ వార్డు నుంచి పేరం వెంకటనర్సారెడ్డి, 11వ వార్డు నుంచి మేడం సుభాషిణి, 17వ వార్డు నుంచి అన్నవరపు రవితో పాటు మొత్తం 28 వార్డులకు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్‌లు వేసేందుకు ఉదయం నామినేషన్ కేంద్రాలకు బయలుదేరారు. వీరిని నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకు టీడీపీ ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకుందని సమాచారం. అందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన కడియాల రమేష్, కర్ణా శ్రీను ఆధ్వర్యంలో నరసరావుపేట ప్రాంతం నుంచి వచ్చిన దాదాపు 200 మందికిపైగా రౌడీమూకలు నామినేషన్ కేంద్రమైన బాలికల ఉన్నత పాఠశాల వద్ద కర్రలు, కత్తులు, రాళ్లతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భీతావహ వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో కూడా అర్థంగాని తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతటితో ఆగకుండా నామినేషన్ కేంద్రంలోకి వెళ్లి మరీ వైఎస్సార్ సీపీ అభ్యర్థుల చేతుల్లోని నామినేషన్ పత్రాలు లాక్కొని చించి వేసి కొట్టి బయటకు నెట్టి వేశారు. టీడీపీ రౌడీలను ఎదుర్కొని నామినేషన్‌లు వేసే పరిస్థితి లేకపోవడంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా ఎన్నికల విధుల్లో భాగంగా నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న ముండ్లమూరు సాక్షి రిపోర్టర్ కొణతం సురేష్‌రెడ్డిపై సైతం టీడీపీ గూండాలు దాడి చేశారు. మూకుమ్మడిగా 20 మంది టీడీపీ గూండాలు ఒక్కసారిగా చుట్టుముట్టి విలేకరిపై దాడి చేశారు. ఇక్కడుంటే చంపేస్తామని బెదిరించారు. ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, సీఐ నాగమల్లేశ్వరరావు తెరవెనుక పాత్ర పోషించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాయమాటలు చెప్పి ప్రేక్షకపాత్ర వహించి...
నామినేషన్ కేంద్రం వద్ద పచ్చ గూండాలు వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారన్న సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కనిగిరి నుంచి హుటాహుటిన దర్శి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను వెంటబెట్టుకుని మరోసారి నామినేషన్ కేంద్రం వద్దకు బయలుదేరారు. పోలీసులు సైతం టీడీపీ గూండాలను ప్రోత్సహిస్తూనే వైఎస్సార్ సీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందంటూ మీరు వెళ్లేదానికి లేదంటూ అడ్డుచెప్పారు. అదే సమయంలో నామినేషన్ కేంద్రం చుట్టూ వందలాది మంది టీడీపీ గూండాలు ఉన్నా పట్టించుకోలేదు. సీఐ నాగమల్లేశ్వరరావు వైఎస్సార్ సీపీ శ్రేణులను కవ్వించే విధంగా ఓవరాక్షన్ చేశారని తెలుస్తోంది. మేము దగ్గరుండి నామినేషన్లు వేయిస్తామని పోలీసు అధికారుల మాటలు నమ్మి నామినేషన్ కేంద్రానికి బయలుదేరిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై పచ్చమూకలు దాడులు చేస్తున్నా పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం విమర్శలకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ఇదేనా ప్రజలకు పోలీసులు కల్పించే రక్షణ అని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి నిలదీశారు. వీటన్నింటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, సదరు అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని స్వేచ్ఛగా నామినేషన్లు వేసే విధంగా చూడాలని ఆయన కోరారు.
చివరి రోజైనా వేయనిస్తారా..?
పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌లు వేసేందుకు ఆదివారం చివరి రోజు. ఒక రోజు ముందుగానే దర్శి మున్సిపాలిటీలో చైర్మన్ స్థానంతో పాటు కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్‌లు వేసేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముందుకు వచ్చారు. కానీ, టీడీపీ రౌడీల దాడులతో నామినేషన్‌లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో చివరి రోజు అన్ని స్థానాలకు నామినేషన్‌లు వేసేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని తమకు స్వేచ్ఛగా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని, తమకు రక్షణ కల్పించాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంలో చివరి రోజు టీడీపీ రౌడీలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికను వైఎస్సార్ సీపీ సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో దర్శిలో ఎటువంటి దౌర్జన్యాలు, దాడులకు తావులేకుండా నామినేషన్లు వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికార పార్టీకి అనుకూలంగా..
దర్శి ఎంఈఓ–2 బి.రమాదేవి 9, 10, 11, 12 పోలింగ్ బూత్‌లకు ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నారు. ఉదయం 11.15 గంటలకు వైఎస్సార్ సీపీ 9వ వార్డు అభ్యర్థి పేరం వెంకటనర్సారెడ్డి, 11వ వార్డు అభ్యర్థి మేడగం సుభాషిణి నామినేషన్‌లు వేసేందుకు వెళ్లిన సమయంలో 45 నిముషాల పాటు పత్రాలు తీసుకోకుండా కాలయాపన చేశారు. ఈ లోపు టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి మామ కడియాల రమేష్, కడియాల శివ లోపలికి వచ్చిన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ చేతిలో ఉన్న నామినేషన్ ఫారాలు తీసుకుని చించివేశారు. అదేమని అడగ్గా.. నా కొడకల్లారా.. నామినేషన్ వేసే ధైర్యం మీకెక్కడిదని బెదిరించారు. అక్కడే ఉన్న ఎన్నికల అధికారిని అడగ్గా.. ఆమె విసిగించుకుని కావాలంటే రేపు నామినేషన్ వేసుకోండని సమాధానం చెప్పారు.


