నామినేషన్‌ కేంద్రం చుట్టూ టీడీపీ గూండాలా..? | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రం చుట్టూ టీడీపీ గూండాలా..?

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

మా అభ్యర్థిని కొడుతుంటే వందలాది మంది పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోరా..? స్వేచ్ఛగా నామినేషన్లు వేసేందుకు సహకరించాలి నేడు నామినేషన్లు వేసేందుకు కచ్చితంగా వెళ్తాం.. శాంతియుతంగా నామినేషన్‌ వేయిస్తారో.. అల్లర్లు చేయిస్తారో పోలీసులదే బాధ్యత దర్శి ఎమ్మెల్యే వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

దర్శి: దర్శిలో మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు వేసే కార్యాలయం చుట్టూ వందలాది మంది టీడీపీ వాళ్లు కర్రలు, రాళ్లు పట్టుకుని ఉన్నాగానీ పోలీసులు వారిని ఏమీ అనకుండా వదిలేశారని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై టీడీపీ రౌడీల దాడులను ఖండిస్తూ దర్శిలోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ సీఈసీ సభ్యురాలు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు వెళ్లారని, స్థానిక గడియార స్తంభం సెంటర్‌ వద్ద నామినేషన్‌కు వెళ్లడానికి లేదని పోలీసులు ఆపారని తెలిపారు. తాను ఎస్పీకి ఫోన్‌ చేసి ఇక్కడ జరుగుతున్న గొడవల గురించి వివరించానన్నారు. ఆ తర్వాత దర్శి డీఎస్పీ, సీఐ, ఎస్సైలు మా వద్దకు వచ్చి మీరందరూ అక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని, మమ్మల్ని నమ్మి మీ అభ్యర్థిని మాతో పంపాలని, మేం దగ్గరుండి నామినేషన్‌ వేయిస్తామని నమ్మించి అభ్యర్థిని వారితో తీసుకెళ్లారన్నారు. వంద మందికిపైగా పోలీసులు చుట్టూ ఉన్నాగానీ.. వారు తీసుకెళ్లిన వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిపై టీడీపీ రౌడీలు దాడి చేశారని, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని బూచేపల్లి ధ్వజమెత్తారు. మిమ్మల్ని నమ్మినందుకు మీరు మాకిచ్చే బహుమతి ఇదేనా..? అని డీఎస్పీ, సీఐలను ప్రశ్నించారు. పోలీసులు నిస్సహాయ స్ధితిలో ఉండి కావాలనే వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థిపై దాడి చేయించి ఇబ్బంది పెట్టారని బూచేపల్లి ఆరోపించారు. తమ అభ్యర్థిని చంపాలని చూస్తున్నా.. పోలీసులు మాత్రం అలాగే చూస్తూ ఉన్నారంటే.. వారు ఎవరికి కాపలా కాస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థులు మాత్రం నామినేషన్లు వేసుకుంటున్నారు.. మా అభ్యర్థులను మాత్రం నామినేషన్లు వేయనీయడం లేదు.. ఇదేనా మీ చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ముఖ్యమని పోలీసులకు హితవు పలికారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నామని, మున్సిపల్‌ చైర్మన్‌ కోసం ఇంత రాద్దాంతం చేయడం ఇప్పుడే చూస్తున్నామని తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. నేడు నామినేషన్లకు చివరిరోజు కావడంతో తమ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారని, ఎవరికీ భయపడేది లేదని, భయపడ్డామనుకుంటే అది మీ పొరపాటేనని బూచేపల్లి స్పష్టం చేశారు. గొడవలు లేకుండా ఉండాలని ఒకసారి పోలీసులను నమ్మితే.. వారు మాత్రం మమ్మల్ని నమ్మించి దెబ్బకొట్టారని.. దర్శిలో మినహా జిల్లాలో ఎక్కడా అల్లర్లు లేవని.. అంతటా ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ఇక్కడ మాత్రమే ఇలా జరుగుతుందంటే కారణం ఎవరో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. ప్రశాంతంగా ఉండే దర్శిలో గొడవలు, అల్లర్లు, కొట్లాటలు వంటి నూతన సంస్కృతికి పోలీసులు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంతంగా నామినేషన్లు వేయించాల్సిన బాధ్యత పోలీసుల చేతుల్లోనే ఉందన్నారు. డీజీపీ, కలెక్టర్‌, ఎస్పీలు స్పందించి ఆదివారం జరిగే నామినేషన్లు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగేలా చూడాలని బూచేపల్లి కోరారు. విలేకర్ల సమావేశంలో పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement