● సీపీఎం పిలుపు
ఒంగోలు టౌన్: ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ఒంగోలు నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన అందించే అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్ధించింది. స్థానిక సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ప్రణాళికను నగర కమిటీ నాయకులు చీకటి శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసరావు, ఎన్.వీరాస్వామి, బీవీ రావు, రమేష్, మహేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఇంటికి నీరు, ప్రతి కాలనీకి రోడ్డు, ప్రతి కుటుంబానికి నివాసం, ప్రతి యువతీ యువకుడికి ఉపాధి అనే నినాదంతో ఎన్నికలకు పోతున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ రోజూ మంచినీరు ఇవ్వాలని, పోతురాజు కాలువలో పూడిక తొలగింపు చేయాలని, ఆక్రమణల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శివారు కాలనీలను అభివృద్ధి చేయాలని, నాణ్యమైన సిమెంట్, బిటీ రోడ్లు వేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నివాస స్థలాలు పంపిణీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, తక్కువ ఖర్చుతో చదువుకునే సౌకర్యం కల్పించాలని కోరారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్నారు. రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించాలని, పట్టణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని సూచించారు. శ్మశాన వాటికల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. కొత్త పాలనా కాలం ప్రారంభమైన వెంటనే తాగునీరు, డ్రైనేజీ, పారిశుద్యం, వీధి దీపాలు, గుంతల రోడ్లు, ముంపు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


