● వైఎస్సార్ సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శాంతిరెడ్డి, నాయకుడు గోవర్దన్‌రెడ్డి ఆగ్రహం
కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సరైన పత్రాల సెట్‌ను అధికారులు, సిబ్బంది అందించకపోవడంపై వైఎస్సార్ సీపీ నుంచి కనిగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పులి శాంతిరెడ్డి, ఆ పార్టీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు సిరుప వెంకట గోవర్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాల సెట్‌లోని ఫారాలన్నీ సక్రమంగా అందజేయకపోవడంపై శుక్రవారం ఎన్నికల నిర్వహణ అధికారులు, సిబ్బందిని నిలదీశారు. కనీస అవగాహన లేకుండా నామినేషన్ సెట్‌లోని కొన్ని పత్రాలు మాత్రమే ఇవ్వడంపై గట్టిగా ప్రశ్నించారు. దీంతో హడావిడి కారణంగా తాము పరిశీలించలేదని, అందుబాటులో ఉన్న పత్రాల సెట్లను అందజేశామని చెప్పి.. మరో సెట్ పత్రాలను సిబ్బంది అందజేశారు. అయితే, రెండో సారి కూడా ఉద్దేశపూర్వకంగా పొంతన లేని.. నామినేషన్ సెట్‌కు సరిపోల్చని పత్రాలివ్వడంపై శాంతిరెడ్డి, గోవర్దన్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు పూర్తి నిష్పక్షపాతంగా, నిజాయితీగా వ్యవహరించాలని, మరోసారి ఇలా జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


