పెద్దారవీడు: మోటార్ సైకిల్‌పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దారవీడు మండల పరిధిలోని తోకపల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన ఉప్పాల రాజారావు (24) గురువారం సాయంత్రం మోటార్ సైకిల్‌పై పెద్దారవీడు ఎస్సీకాలనీలో వివాహానికి వచ్చాడు. వివాహం అనంతరం త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామానికి మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. మార్గమధ్యంలో జాతీయ రహదారిపై తోకపల్లి గ్రామ సమీపంలోకి రాగానే హనుమాన్జంక్షన్కుంట నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇటీవల త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. భార్య దగ్గరకు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. భార్య, తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.


