మర్రిపూడి: పిడుగుపాటుకు గేదెల కాపరి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తంగెళ్ల పంచాయతీ అయ్యవారిపాలెంలో గురువారం జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తంగెళ్ల పంచాయతీ అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన జ్యాష్టి శ్రీను (55) రోజువారీగా తన గేదెలను తోలుకుని ఊరికి తూర్పు వైపున ఉన్న కుమ్మరివారి పొలం వెళ్లాడు. గేదెలు మేపుకుంటున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో శ్రీను సమీపంలో ఉన్న తాటిచెట్టు కిందకు చేరుకున్నాడు. ఒక్కసారిగా పెద్ద మెరుపుతో కూడిన ఉరుము వచ్చి తాడిచెట్టుపై పిడుగు పడింది. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. గేదెలు పొలం నుంచి ఇంటికి వచ్చినా శ్రీను రాకపోవడంతో బంధువులు పొలం వెళ్లి వెతికారు. చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్న శ్రీను మృతదేహాన్ని చూసి బంధువులు పెద్ద ఎత్తున విలపించారు. మతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


