● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: జిల్లాలో వివిధ పనుల కోసం వచ్చే విదేశీయులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, గృహ యజమానులు, హాస్టళ్లు, ఆశ్రమాలు, సత్రాలు, విద్యా సంస్థలు, ఇతరా సంస్థల నిర్వాహకులు వారి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ వద్ద ఆశ్రయం పొందుతున్న విదేశీయుల రాక, బస, బయల్దేరే సమయాలకు సంబంధించిన వివరాలు తప్పసినరిగా తెలియజేయాలని సూచించారు. నేపాల్, భూటాన్ పౌరులతో సహా డిజిటల్ రిపోర్టింగ్ ద్వారా నమోదు చేసి 24 గంటల్లోపు ఫారినర్స్ రిజస్ట్రేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు సమాచారం అందివ్వాలన్నారు. విదేశాల నుంచి విద్య, వైద్యం, పర్యటనల కోసం జిల్లాకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. విదేశీలయుల పాస్‌పోర్ట్, వీసా, వ్యక్తిగత వివరాలు, వసతి వివరాలను ది ఇమ్మిగ్రేషన్ అండ్ పారినర్స్ చట్టం 2025, సెక్షన్ 8 ప్రకారం తప్పనిసరిగా వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసి కార్యాలయంలో అందించాల్సిన బాధ్యత నిర్వాహకుల మీద ఉందన్నారు. ఆన్‌లైన్ వ్యవహారంలో ఆయా సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్థన్ రాజు హెచ్చరించారు.


