పొదిలి: పట్టణంలోని ఓ లాడ్జిలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పొదిలికి చెందిన సయ్యద్ కరీముద్దీన్ (23) తన స్నేహితుని నిశ్చితార్థం ఉండటంతో సోమవారం స్నేహితులతో కలిసి పట్టణంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. రాత్రి కొంత మంది స్నేహితులతో కలిసి కరీముద్దీన్ కూడా అందులో బస చేశాడు. మరుసటి రోజు ఉదయం ఎవరి దారిన వారు వెళ్లారు. కరీముద్దీన్ ఎంతకూ లేవక పోవడంతో లాడ్జి సిబ్బంది అతడిని లేపే ప్రయత్నం చేశారు. ఎంతకూ లేవక పోవడంతో లాడ్జి సిబ్బంది, స్నేహితులు కలిసి వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజేష్ తన సిబ్బందితో లాడ్జిని, వైద్యశాలలో మృతదేహాన్ని పరిశీలించిన వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పొదిలి వైద్యశాలకు తరలించారు.


