పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో రొయ్యల చెరువులు
రొయ్యలతో పాటు వల వదిలేసి వెళ్లిన దొంగలు
సింగరాయకొండ: రొయ్యల చెరువుల్లో రాత్రి వేళ చోరీలకు పాల్పడుతూ సుమారు రూ.80 లక్షలకుపైగా విలువైన రొయ్యలు దొంగలు విడతల వారీగా చోరీ చేసిన సంఘటన మండలంలోని పాతసింగరాయకొండ, బింగినపల్లి పంచాయతీల పరిధిలోని చెరువుల వద్ద జరిగింది. ఆక్వా రైతు వలేటి వెంకట నరసింహం కథనం ప్రకారం.. ఈ ప్రాంతంలో సుమారు 50కుపైగా చెరువుల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. పది రోజులుగా చెరువుల్లో రొయ్యలు చోరీ అవుతున్నాయి. రోజూ ఉదయాన్ని చెరువు గట్లపై కొన్ని రొయ్యలు పడి ఉండటంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. సోమవారం రాత్రి ఎప్పటిలాగే చోరీకి వచ్చిన ఏడుగురు దొంగలు షార్ట్‌లు ధరించి జాతీయ రహదారిపై పెరల్ డిస్టిలరీ సమీపంలో ఆటో ఉంచి అక్కడి నుంచి రైలు కట్ట సమీపంలో మద్యం తాగారు. అనంతరం వలలు తీసుకొచ్చి రొయ్యలు చోరీకి పాల్పడ్డారు. ఇది గమనించిన కాపలాదారులు వెంటబడటంతో వారు రొయ్యలు ఉన్న వలను, గోతాలను వదిలేసి పారిపోయారు. వారు తెచ్చిన గోతాలు, తాగిన మద్యం బాటిళ్ల ఆధారంగా విచారిస్తే దొంగలు ఉలవపాడు మండలంలోని తీరప్రాంతానికి చెందిన వారుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగరాయకొండలో రొయ్యలు కొనుగోలుదారులను కూడా విచారించామని, దొంగల ఆచూకీ దొరకలేదని, వీరు చోరీ చేసిన రొయ్యలను వాహనంలో కావలి ప్రాంతానికి తీసుకెళ్లి అమ్మినట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 20 కౌంట్ ఉన్నాయని, కేజీ ధర రూ.650లు ఉండగా టన్ను రూ.6 లక్షలు ఉంది. కొద్ది రోజులుగా ఒక చెరువుకు 100 కేజీల మేత వేయాల్సి ఉండగా కేవలం 50 కేజీల మేత వేస్తున్నామని, దీనిని బట్టి దొంగలు ఏ స్థాయిలో చోరీ చేశారో అర్థమవుతోంది. ఇది కేవలం ఒక్క రోజు జరిగింది కాదు. కొద్ది రోజులుగా జరుగుతున్న తంతని ఆక్వా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలే గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఈ విధంగా చేతికి వచ్చిన రొయ్యలు చోరీ జరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై నిఘా పెంచి చోరీ జరగకుండా నియంత్రించాలని రైతు నరశింహం పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చోరీకి పాల్పడిన వారి ఆచూకీ తెలిస్తే 98491 66431కు సమాచారం ఇవ్వాలని ఆక్వా రైతులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
విడతల వారీగా రూ.80 లక్షల రొయ్యలు చోరీ
రొయ్యల చెరువుల్లో రాత్రి వేళ దోపిడీకి పాల్పడుతున్న దొంగలు
దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన కాపలాదారులు


