వినాయక నిమజ్జనంలో కొట్లాట | - | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో కొట్లాట

Sep 30 2026 2:22 AM | Updated on Sep 30 2026 2:22 AM

దర్శి: పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనం వేడుకల్లో కొట్లాటలు జరిగాయి. తొలుత కూటమి పార్టీలోని ఇరువర్గాల వారు తీవ్రంగా దూషించుకుని కొట్లాడుకున్నారు. మాటామాట పెరిగి తన్నుకున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీకి చెందిన కొందరికి స్వల్పగాయాలు కాగా మరి కొందరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. గడియారం స్తంభం సెంటర్‌లో వినాయకుడిని సుమారు రెండు గంటలకుపైగా నిలబెట్టి సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. ఈ తరుణంలో కూటమి పార్టీ వారికి విభేదాలు వచ్చాయి. వేళ్లు చూయించుకుని రెచ్చగొట్టుకున్నారు. ఆ తర్వాత కొట్టుకున్నారు. గోపు వెంకటేశ్వర్లు అనే జనసేన నాయకుని ఇంటి మీదకు వెళ్లి రాళ్లు విసిరేసి అద్దాలు కూడా పగులగొట్టారు. అంతే కాకుండా బయట ఉన్న తమ వారికి చెందిన బుల్లెట్‌పై కూడా దాడి చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రామారావు అక్కడకు చేరుకుని ఇంటిపై దాడి చేసే వారిని చెదరగొట్టి పంపించి వేశారు. రాత్రంతా అక్కడ పోలీసులను కాపలా పెట్టి వారికి రక్షణ కల్పించారు. అర్ధరాత్రి ఇంటిపైకి వెళ్లి దాడి చేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పక్క నివాసాల వారు ఏం జరుగుతుందో అని భయాందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధితులు పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ ఉండటం కనిపించింది. రాత్రి జరిగిన దాడి విషయంలో కేసులు కట్టారా లేదా అన్న విషయాలు తెలియ రావాల్సి ఉంది.

ఫ్లెక్సీల వివాదమే గొడవలకు దారి తీసిందా?

ఇటీవల జనసేన పార్టీ నాయకులు టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మీకి కట్టిన ఫ్లెక్సీ స్థానంలో ఫ్లెక్సీ కట్టారని, ఆ ఫ్లెక్సీని తీసేయించకపోగా జనసేన నాయకులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి జనసేన నాయకులే అక్కడ రెండు దఫాలుగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ తరుణంలో జనసేన ఫ్లెక్సీలు తీసేసి ఇటీవల మళ్లీ గొట్టిపాటి లక్ష్మి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అప్పుడు మాత్రం జనసేన నాయకులు మౌనంగానే ఉన్నారు. అయితే మంగళవారం మళ్లీ జనసేన నాయకులు ఫ్లెక్సీ అక్కడ కట్టకుండా ఉండేందుకు గొడవలు పెట్టుకుంటే తమ జోలికి రాకుండా ఉంటారని ఇంటిపై దాడి చేశారన్న చర్చ జరుగుతోంది. ఏదేమైనా పోలీసులు ఈ విషయంలో కేసులు కడతారో లేదో వేచి చూడాల్సిందే. ఈ విషయంపై పోలీసులు సైతం రాజీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇరువురికి రాజీ కుదిర్చాలని, ఎవరిపై కేసులు కట్టవద్దని నియోజకవర్గ పెద్ద నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.

అర్ధరాత్రి జనసేన నాయకుని ఇంటిపై దాడి

పగిలిన సదరు నేత ఇంటి అద్దాలు

పోలీసుల సమక్షంలోనే దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement