● గంట పాటు రోడ్డు దిగ్బంధం
● పోలీసులు, ఎంపీడీఓ చొరవతో ధర్నా విరమణ
కురిచేడు: రెండు నెలలుగా తాగునీటి సమస్యతో బాధపడుతున్నామని స్థానిక ఎస్సీ మహిళలు ఖాళీ బిందెలతో చర్చి వద్ద ఆందోళనకు దిగారు. ధర్నాకు ఎమ్మార్పీఎస్ నాయకులు కంబంపాటి మాణిక్యరావు, జోసఫ్, దోరెపల్లి రామయ్య సారధ్యం వహించారు. పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ నెట్‌వర్క్ వారు రోడ్డు మొత్తం గుంతలు తీసి తాగునీటి పైపులను పగలగొట్టడంతో పాటు అట్లపల్లి చెరువు అడుగంటిపోయి నీటికష్టాలు ప్రారంభమయ్యాయి. సాగర్ కాలువ ద్వారా నీటిని అట్లపల్లి చెరువుకు నింపినా పైపులైన్ పూర్తిగా ధ్వంసం కావడంతో నీరు సరఫరా కావడం లేదన్నారు. అధికారులు తాత్కాలికంగా ట్యాంకులు ఏర్పాటు చేసి అరకొరగా నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వాటిని కూడా అధికార పార్టీ నాయకులు తమ ఖాతాలో జమ చేసుకునేందుకు ట్యాంకర్ల వద్ద ఫొటోలకు ఫోజులిస్తున్నారన్నారు. దీంతో విసుగు చెందిన మహిళలు రోడ్డెక్కారు. ఎస్సై జి.కోటయ్య, ఎంపీడీఓ సత్యప్రసాదు వచ్చి కాలనీవాసులతో మాట్లాడి సరిపడినంత నీరు వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు.


