‘100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు’ | - | Sakshi
Sakshi News home page

‘100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు’

Sep 29 2026 2:03 AM | Updated on Sep 29 2026 2:03 AM

‘100 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారు’ నేడు పెన్షనర్స్‌ అసోసియేషన్‌ మహాధర్నా

● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి ఫిర్యాదు

ఒంగోలు సబర్బన్‌: కొత్తపట్నం మండలం రాజుపాలెంలో అధికార టీడీపీకి చెందిన ఆంజనేయ ఆక్వా యజమానులు 100 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని రైతులు సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రకాశం భవన్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వ్యవసాయ మిషన్‌ జిల్లా మాజీ చైర్మన్‌ ఆళ్ల రవీంద్రారెడ్డి మండలంలోని రాజుపాలెం, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, ఈతముక్కల రైతులతో కలిసి ఆంజనేయ ఆక్వా కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఆంజనేయ ఆక్వా కంపెనీ రాజుపాలెంలో ప్రభుత్వ భూములు 100 ఎకరాలతో పాటు రైతుల నుంచి మరో 170 ఎకరాలు కొనుగోలు చేసి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. వరద నీరు పోయే బంజరు భూములు, నాగార్జున సాగర్‌ కాలువను ఆక్రమించడంతో వర్షం నీరు, వరద నీరు పూర్తిగా ఆగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజుపాలెంలోని ఆంజనేయ ఆక్వా యజమానులు బకింగ్‌ హమ్‌ కాలువ, బండి పోరంబోకు, వాగు పోరంబోకు భూములు, సీలింగ్‌ భూములు, అనాధీన భూములు, డీకే పట్టా భూములు సుమారు 100 ఎకరాలు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకొని కొన్నేళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌కు చెందిన సుమారు 40 ఎకరాలను ఆంజనేయ ఆక్వా ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ చెరువులతో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారి పంటలు పండటం లేదన్నారు. పరిసర ప్రాంత రైతులు ఆంజనేయ ఆక్వా యజమానులను ఎదిరించలేక భయంతో వణికిపోతున్నారన్నారు. రాజుపాలెం, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, ఈతముక్కల గ్రామ రైతులకు చెందిన భూములను ఉప్పు నీటి బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆంజనేయ ఆక్వా కంపెనీ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచిపెట్టాలని కలెక్టర్‌ను కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో అంజిరెడ్డి, రవీంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు, బలగాని వెంకట నారాయణ, యూత్‌ అధ్యక్షుడు మల్లికార్జున, బీసీ సెల్‌ నాయకులు నారాయణ, సురేష్‌, శ్రీనివాసులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలువన్‌టౌన్‌: ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మహాధర్నా నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ అధ్యక్షుడు అంకిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్నా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై బుధవారం ఉదయం 10 గంటల వరకు సాగుతుందన్నారు. మహా ధర్నాలో సర్వీస్‌ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, జిల్లాలోని మండల యూనిట్స్‌ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement