● ఆటో, ట్రక్ ఆటో ఢీకొని ఇద్దరు మృతి
కనిగిరి: ఎదురెదురుగా వస్తున్న ఆటో, ట్రక్ ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటన మండలంలోని ఎడవల్లి సమీపంలో ఎన్‌హెచ్565 హైవే కనిగిరి– పొదిలి రోడ్డుపై సోమవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన కోలా ఏలేజర్ (32) గుంటూరి సుబ్బారావు(48) ఇద్దరు కలిసి ఆటోలో బొబ్బర్లు, ఇతర విత్తనాల కొనుగోలుకు పెదారికట్ల వైపు వెళ్తున్నారు. అలాగే పొదిలి వైపు నుంచి వేగంగా ఎదురుగా ట్రక్ ఆటో వస్తుంది. ఈ రెండు ఆటోలు మండలంలోని ఎడవల్లి సమీపంలో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఏలేజర్, గుంటూరి సుబ్బరావులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఆటో ముందు భాగం నుజ్జు నుజ్జై మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లొయిన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంలో ట్రక్ ఆటో డ్రైవర్ చొప్పరపు శ్రీనుకు స్వల్పగాయాలైయ్యాయి. ఎస్సై జి.సందీప్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుడి భార్య గుంటూరి రాధ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. మృతుడు గుంటూరు సుబ్బారావుకు, భార్య, ఇద్దరు పిల్లలు కలరు.
వద్దన్నా.. వినకుండా వెళ్లాడు...
అకాల వర్షాలకు భూమి కొంత తడి ఎక్కడంతో.. ఎరువులు, విత్తనాలు తెస్తానని చెప్పి వెళ్లిన భర్త గంట వ్యవధిలోని మృత్యువడి చేరడంతో భార్య రోదన చూపరులను కంతతడి పెట్టింది. చేతికి అందివచ్చిన కుమారుడు కోలా ఏలేజర్ మృతి చెందడంతో తండ్రి అబ్రహం.. కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు.


