ఆంజనేయ ఆక్వా రొయ్యల సాగులో అన్నీ అక్రమాలే... 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల ఆక్రమణ ఎన్‌ఎస్పీ, బకింగ్ హాం కాలువలు కనుమరుగు చేసిన వైనం నాలుగు గ్రామాల రైతులకు అందని సాగునీరు ఉప్పునీటి బోర్లతో ఇబ్బంది పడుతున్న రైతులు ఆంజనేయ ఆక్వా అక్రమాలపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు సన్నకారుల రైతుల చెరువులపైనా కన్నేసిన టీడీపీ ప్రజాప్రతినిధి
ఆంజనేయ ఆక్వాపై కలెక్టర్‌కు ఫిర్యాదు
భూములు చెరబట్టి..రొయ్యల సాగేసి..
ప్రభుత్వ భూముల్లో
సన్నకారు రైతులపై
కక్షపూరితంగా అధికారులు..
బీరంగుంటలో 30 ఏళ్లుగా రొయ్యల సాగు చేసుకుంటున్న సన్నకారు రైతులపై టీడీపీ ప్రజా ప్రతినిధి, అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. శ్మశానానికి 100 మీటర్లలోపు రొయ్యల సాగు చేస్తున్నారని, ఓ వ్యక్తి ద్వారా టీడీపీ ప్రజా ప్రతినిధే ఫిర్యాదు చేయించి ఆ చెరువులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐదుగురు రైతుల రొయ్యల సాగు చేసుకొంటున్న చెరువు కట్టలను తొలగించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా 100 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించి, రొయ్యల సాగు చేస్తున్న ప్రజా ప్రతినిధికి చెందిన భూముల గురించి పట్టించుకోకుండా, సన్నకారు రైతులపై అధికారులు కక్షపూరితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు చెరబట్టి రొయ్యల సాగు చేస్తున్నారు. బకింగ్ హాం కాలువ, బండిదారి పోరంబోకు, వాగు పోరంబోకు, సీలింగ్ భూములు, అనాధీన భూములు, పట్టాభూములు, ఎన్‌ఎస్పీ కాలువ భూములు ఇలా వేటినీ వదలకుండా ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. కొత్తపట్నం మండల పరిధిలోని అనధికారిక రొయ్యల చెరువుల వల్ల నష్టపోతున్న రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు.. 30 ఏళ్లుగా అన్ని అనుమతులతో రొయ్యల సాగు చేస్తున్న సన్నకారు రైతుల చెరువులను ధ్వంసం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
రొయ్యల సాగులో పచ్చనేతలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే చెరువులు తవ్వి రొయ్యల సాగు చేస్తున్నారు. ప్రభుత్వ భూములనూ చెరబడుతున్నారు. చివరికి ఎన్‌ఎస్పీ, బకింగ్ హాం కాలువలను అన్నింటినీ కలిపేసుకొని దర్జాగా రొయ్యల సాగు చేస్తున్నారు. కొత్తపట్నం మండలంలో రాజుపాలెం గ్రామ పరిధిలో సుమారు 270 ఎకరాల్లో ఒంగోలుకు చెందిన టీడీపీ ముఖ్య ప్రజా ప్రతినిధి రొయ్యల సాగు చేస్తున్నారు. ఇందులో 100 ఎకరాలకు పైగా దౌర్జన్యంగా ఆక్రమించిన ప్రభుత్వ భూములన్నాయి. ఈ ఆక్రమణలో ప్రధానంగా బకింగ్ హాం కాలువ, బండిదారి పోరంపోకు, వాగు పోరంబోకు, సీలింగ్ భూములు, అనాధీన భూములు, పట్టాభూములు, ఎన్‌ఎస్పీ కాలువ భూములు ఉన్నాయి. ఈ భూముల విలువ దాదాపు రూ.15 కోట్లకు పైనే ఉంటుంది. టీడీపీ ప్రజా ప్రతినిధి కావడంతో అధికారులు సైతం అక్రమాల సాగువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆక్రమణలపై కొత్తపట్నానికి చెందిన లంకపోతు అంజిరెడ్డి, ఆప్రాంత రైతులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.
కాలువల పూడ్చివేతతో..
ఆంజనేయ ఆక్వా సాగు చేస్తున్న 270 ఎకరాల భూమి గుండా వరదనీటి కాలువ, నాగార్జున సాగర్ కాలువ వెళ్తున్నాయి. వీటిని పూర్తిగా ఆక్రమించి తమ రొయ్యల చెరువుల్లో కలిపేసుకున్నారు. దీంతోపై ప్రాంతాల్లో వర్షపు నీరు పూర్తిగా ఆగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు బకింగ్ హాం కాలువకు సంబంధించిన 40 ఎకరాల భూమిని ఆక్రమించటంతో, వరద నీరు నిలిచిపోయి రైతుల వ్యవసాయ భూముల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోతుండటంతో పైర్లు దెబ్బతింటున్నాయి. ఉప్పు నీటి బోర్లు వేసి రొయ్యలు పండించడంతో నీటి కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో చుట్టు పక్కల గ్రామాల్లో పశువులకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కలుషిత నీరు తాగి పశువులు కూడా చనిపోయినట్లు రైతులు వాపోతున్నారు. ఈ చెరువుల ప్రభావంతో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారిపోతుండటంతో, ఇక్కడ పంటలు సైతం పండటం లేదు. రాజుపాలెం, గమళ్లపాలెం, మజ్జిరెడ్డి పాలెం, ఈతముక్కల గ్రామాల రైతులపై రొయ్యల సాగు ప్రభావం పడుతోంది. ఈ గ్రామాల రైతులంతా తమ భూములు ఉప్పునీటి బారిన పడకుండా కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమాల సాగుపై ప్రశ్నిస్తే ఆంజనేయ ఆక్వా కంపెనీ భయాందోళనలకు గురిచేస్తోందని ఆ గ్రామాల రైతులు వాపోతున్నారు. ఆ కంపెనీ దురాగతాలు, దౌర్జన్యాల నుంచి కాపాడాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని, అక్రమాలకు ముగింపు పలకాలని రైతులు కోరుతున్నారు.
వందల ఎకరాలు ఆక్రమించి రొయ్యలు సాగు చేస్తున్నారు
నేను, నా భార్య లంపోతు లక్ష్మి ఎంపీపీగా ఉన్నంత కాలం కానీ, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం పార్టీలు చూడకుండా అందరికీ సేవలందించాను. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండున్నర నెలల్లో సీసీ రోడ్లు, గోకులం పథకాలకు సంబంధించి మండల పరిషత్ తీర్మానాలు ఇస్తేనే అభివృద్ధి పనులు జరిగాయి. టీడీపీ అధికారంలో ఉందని తీర్మానాలు ఎందుకులే అని అనుకోలేదు. మండలంలో వ్యవసాయం తరువాత రెండోది ఆక్వా కల్చర్. దానికి ప్రోత్సాహం ఇచ్చి ఆక్వా రైతులకు అండగా ఉండాల్సింది పోయి రొయ్యల చెరువులను ధ్వంసం చేయడం దుర్మార్గం. ఎక్కడ నుంచో వచ్చి ఈ మండలంలో అనర్హులు రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. వందల ఎకరాలు సాగు చేసేవారిని పట్టించుకోకుండా అర్హులైన మా కుటుంబ సభ్యుల మీదకు రావటం అన్యాయం. ఎమ్మెల్యే జనార్దన్‌కు రాజుపాలెంలో సుమారు 270 ఎకరాలు ఉంది. అందులో బకింగ్‌హాం కాలువ, బండి పోరంబోకు, వాగు పోరంబోకు భూములు, సీలింగ్ భూములు, అనాధీన భూములు, డీకే పట్టా భూములు సుమారు 100 ఎకరాలు రొయ్యల సాగు చేసుకుంటున్నారు. వీటిని కూడా చదును చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
– లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు, రొయ్యల రైతు
కొత్తపట్నం మండలం రాజుపాలెం గ్రామంలో అధికార టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఆంజనేయ ఆక్వా యజమానులు 101.39 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని కలెక్టర్‌కు కొత్తపట్నం మండల రైతులు ఫిర్యాదు చేశారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వ్యవసాయ మిషన్ జిల్లా మాజీ చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి మండలంలోని రాజుపాలెం, గమళ్లపాలెం, వజ్జిరెడ్డిపాలెం, ఈతముక్కలలోని రైతులతో కలిసి ఆంజనేయ ఆక్వా కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఆంజనేయ ఆక్వా కంపెనీ అక్రమాలకు పాల్పడిందని ఆ ఫిర్యాదులో వివరించారు. రాజుపాలెంలో ప్రభుత్వ భూములు 101.39 ఎకరాలతో పాటు రైతుల నుంచి మరో 170 ఎకరాలు కొనుగోలు చేసి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారని, మొత్తం కలిపి దాదాపు 271.39 ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు వేసినట్లు చెప్పారు. ఆ భూముల్లో వరద నీరు పోయే బంజరు భూములు, నాగార్జున సాగర్ కాలువను కూడా ఆక్రమించుకున్నట్లు పేర్కొన్నారు.


