జగన్ పర్యటనపై కలెక్టర్‌ను కలిసిన బూచేపల్లి
దివంగత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి, నాయకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం ఒంగోలు రానున్నారు. ఉదయం 10.50 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కాలేజి గ్రౌండ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ నుంచి క్లౌపేటలోని వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత కాకుమాను రాజశేఖర్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం ఒంగోలు నుంచి తిరుగుపయనం అవుతారు.
జగన్‌ను సీఎం చేయాలనే తలంపుతో...
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో కాకుమాను రాజశేఖర్ పార్టీలో చురుకుగా పనిచేశారు. ఇందులో భాగంగానే పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఎప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు. జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఈ మధ్యకాలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడంలో, కూటమి పాలన వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలు ఎత్తి చూపడంలో అలుపెరగని పోరాటం చేశారు. ఈనెల 22వ తేదీ విజయవాడలో డీఎస్సీ స్కాంపై జరుగుతున్న పోరాటంలో పోలీసుల తోపులాట వల్ల పలుమార్లు కింద పడి అస్వస్థతకు గురయ్యారు. తిరిగి వీళ్ల మీదే కేసులు పెట్టారని తెలిసి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. తోపులాటలో అనారోగ్యానికి గురైన ఆయన ఒంగోలు వైద్యశాలలో పరీక్షలు కూడా చేయించుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లో చెకప్ చేయించుకొనేందుకు ఆస్పత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకొని, వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వేధింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురికావటం వల్లనే ఆయన చనిపోయాడని సన్నిహితులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ కుటుంబ సభ్యులకు అండగా ఉండి, వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. జగన్ పర్యటన ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ సోమవారం పర్యవేక్షించారు. ఏబీఎం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబానికి కాకుమాను రాజశేఖర్ తొలి నుంచి అండగా నిలిచారని, పార్టీ కోసం అనేక పోరాటాల్లో చురుకుగా పాల్గొనే వారని చెప్పారు. రాజశేఖర్ మృతితో పార్టీ ఒక మంచి నాయకున్ని, తన ప్రియమైన మిత్రున్ని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ స్వయంగా వచ్చి పరామర్శిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీనేతలు ఐ వెంకటేశ్వరరావు, కటారి శంకరరావు, వేమ శ్రీనివాసరావు, సాగర్, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, తాతా నరసింహగౌడ్, సూర్యరాజేష్, కిరీటి, పిగిలి శ్రీను, ఆనం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటనకు సంబంధించిన విషయమై కలెక్టర్ పి.రాజాబాబును వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం కలిసి వివరించారు. ఈ మేరకు ప్రకాశం భవన్‌లోని చాంబర్‌లో కలిసిన బూచేపల్లి ఒంగోలు పర్యటనకు వస్తున్న వైఎస్ జగన్ రూట్ మ్యాప్ గురించి తెలిపారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ అకాల మృతి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం డీఆర్‌ఓను కూడా కలిసి వినతిపత్రం అందజేశారు. బూచేపల్లితో పాటు మాజీ మంత్రి, కొండపి పార్టీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్టీ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.


