మార్కాపురం: మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) మర్రి శ్రీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఈమె మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీపై వచ్చారు. గతంలో గిద్దలూరు, కొమరోలు మండలాల తహసీల్దార్‌గా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారిగా శ్రీదేవి విధులు నిర్వహించారు.
మార్కాపురం: జేఏసీ పిలుపు మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 45 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డిమాండ్‌లను అరచేతి మీద రాసుకొని తమను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ అయ్యేంత వరకు 100 శాతం బేసిక్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ అమలు చేయాలని కోరారు. జేఏసీ అధ్యక్షుడు శివకృష్ణ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ప్రభుత్వానికి తమ సేవలను అందిస్తున్నా తమ సేవలకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలు అందించామని, అయినా ఇప్పటి వరకు తమ సేవలకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. తమను రెగ్యులర్ చేయడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఉంటే, రెగ్యులర్ చేసే వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100 శాతం జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన ప్రాధాన్యత కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తిరుపతయ్య, విజయ్ భాస్కర్‌రెడ్డి, కోటేశ్వరరావు, రామకృష్ణ, కరుణ, కెతుర, స్వాతి పాల్గొన్నారు.


