ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
పెద్దారవీడు: వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామమైన సుంకేసుల పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం తోకపల్లి గ్రామం సమీపంలో సుంకేసుల పునరావాస కేంద్రంలో ఇంటి నిర్మాణం భూమి పూజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసితులు ఇంటి పట్టాలు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరగా పునరావాస కేంద్రంలో ఎవరు ఇళ్లు నిర్మిస్తారని హేళనగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. నిర్వాసితులు ఇళ్లు నిర్మించాలనే సంకల్పంతో నిర్మాణానికి భూమి చేశారని, త్వరలోనే ఇళ్లను నిర్మించుకుని ప్రవేశం చేస్తారని చెప్పారు. అమరావతి ప్రాంతం రైతులు రాజధానికి కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఎంత ఇచ్చారో అలాగే ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులకు కూడా నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దారవీడు, యర్రగొండపాలెం పార్టీ మండల కన్వీనర్లు పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఎకుల ముసలారెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఏర్వ శేషసేనారెడ్డి, మాజీ సర్పంచ్‌లు అంగిరేకుల ఆదినారాయణ, జిల్లెల మల్లీశ్వరి, నియోజకవర్గం పార్టీ రైతు విభాగం అధ్యక్షులు గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు నరాల రామచంద్రయాదవ్, ఒద్దుల లక్ష్మిరెడ్డి, సొంటి నాగార్జునరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.


