రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ జగదీష్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ జగదీష్‌ మృతి

Sep 21 2026 12:38 AM | Updated on Sep 21 2026 12:38 AM

రోడ్డు ప్రమాదంలో డాక్టర్‌ జగదీష్‌ మృతి విద్యుదాఘాతానికి ఇద్దరు రైతుల దుర్మరణం చెరువులో పడి వ్యక్తి మృతి

ఒంగోలు టౌన్‌: కొత్తపట్నం మండలం సంకువారికుంటకు చెందిన డాక్టర్‌ కసుకుర్తి జగదీష్‌ (48) తెలంగాణలోని సూర్యపేట పిల్లలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రస్తుతం ఆయన ఖమ్మంలోని మమతా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరాలజీ హెచ్‌ఓడీగా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్న భార్య వద్దకు కారులో వెళుతుండగా పిల్లలమర్రి వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగి మృతి చెందారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన ఆయన కసితో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అయినా తన మూలాలను మరిచిపోకుండా పేదలకు వైద్య సేవలందించారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా తలచిన డాక్టర్‌ జగదీష్‌ పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు చేశారని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. అణగారిన ప్రజల బాధలను తన బాధగా భావించి నిరుపేదలకు అండగా నిలిచిన డాక్టర్‌ జగదీష్‌ మరణం సామాన్య ప్రజలకు తీరని లోటని సీపీఐఎంఎల్‌ న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కొత్తపట్నం మండలం నుంచి వచ్చిన తొలి వైద్యుడు జగదీష్‌ మృతి పట్ల శ్రీరాం సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌ ఎండీ డాక్టర్‌ చాపల వంశీకృష్ణ నివాళులర్పించారు. నిరుపేదలకు వైద్యం చేయడంలో డాక్టర్‌ జగదీష్‌ ముందుండేవారని, సామాజిక సేవతో వ్యవహరించే ఆయన మరణం బాధ కలిగిస్తుందన్నారు. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిన డాక్టర్‌ జగదీష్‌కు పలువురు వైద్యులు నివాళులర్పించారు.

జూపూడి ప్రభాకరరావు సంతాపం

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కసుకుర్తి జగదీష్‌ మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అన్నారు. డాక్టర్‌ జగదీష్‌ వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా మానవ సేవగా భావించి వేలాది మంది రోగులకు నూతన జీవనాన్ని ప్రసాదించారని కొనియాడారు. తన నైపుణ్యం, సేవాభావం, మానవతా దృక్పథంతో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ దుర్ఘటనలో ఆయనను కోల్పోవడం తీరని లోటని జూపూడి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ జగదీష్‌ భౌతిక కాయాన్ని కొత్తపట్నం మండలం సంకువారిగుంట గ్రామానికి తరలించి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో, ఆయన అంతిమయాత్రలో పాల్గొని భౌతిక కాయానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు.

పొదిలి రూరల్‌: పొలానికి వేసిన విద్యుత్‌ కంచె తగిలి విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మూగచింతలలో శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బండారు సుబ్బారావు(53) పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. అయితే ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా..పొలం చుట్టూ ఉన్న కంచెకు విద్యుత్‌ సరఫరా అయి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్సై రాజేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మార్కాపురం రూరల్‌: మండలంలోని రాజుపాలెంలో విద్యుదాఘాతానికి దుగ్గెంపూడి కోటయ్య(38) మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే..కోటయ్య పొలాల మధ్య కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగను గమనించక తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కోటయ్య మృతి వార్త తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలికి చేరుకున్నారు. పొలాల్లో విద్యుత్‌ తీగలు కిందకు వేలాడుతున్నాయని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు.

పుల్లలచెరువు: చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..పుల్లలచెరువుకు చెందిన గుమ్మా గాలెయ్య(45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం యాదవ బజార్‌లో ఉన్న వినాయక విగ్రహం నిమజ్జనం జరుగుతుండగా ఊరేగింపు వెంట రాగా బహిర్బూమికి వెళ్లి చెరువులోని గుంతలో పడి మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు. మృతుని స్వగ్రామం మండలంలోని చెన్నంపల్లి కాగా బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా పుల్లలచెరువు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుతన్నట్లు ఎస్సై సాంబశివరావు తెలిపారు.

తెలంగాణాలోని సూర్యాపేట వద్ద జరిగిన ప్రమాదం

నిరుపేద దళిత కుటంబంలో పుట్టి న్యూరో సర్జన్‌గా ఎదిగిన డాక్టర్‌ జగదీష్‌

స్వగ్రామం కొత్తపట్నం మండలం సంకువారికుంటలో సోమవారం అంత్యక్రియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement