అన్ని రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న వారిని గుర్తించకపోవడం దారుణం. కనీసం ఇప్పటికై నా గుర్తించి గౌరవ వేతనం బకాయిల విడుదలకు కృషి చేయాలి. గొప్పలు చెప్పడం తప్పా చంద్రబాబు చేసింది శూన్యం.
పొన్నలూరు మండల పరిషత్ కార్యాలయం
పొన్నలూరు:
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వారిని గౌరవించి నెల నెల చెల్లించాల్సిన వేతనాన్ని కొన్ని నెలలుగా విడుదల చేయకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు క్షేత్ర స్థాయిలో సేవలందిసున్నా కూడా నెలల తరబడి బకాయిలను పెట్టి చిన్నపాటి వేతనాలను కూడా సకాలంలో అందించడంలో పూర్తిగా విఫలమైంది. నాలుగు రోజుల్లో వారి పదవీ కాలం ముగుస్తున్నా వారి పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనం పెంచుతామంటూ పలు సభలు, సమావేశాల్లో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వారి వేతనాలు పెంచడం దేవుడెరుగు గానీ ఉన్న వేతనాలను వారి పదవీ కాలం ముగుస్తున్నా విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సుమారు 28 నెలలుగా ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన రూ.3 వేలు, జెడ్పీటీసీలకు రూ.6 వేలు గౌరవ వేతనం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో మొత్తం 742 మంది ఎంపీటీసీలు, 56 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ 28 నెలల్లో ఎంపీటీసీలకు సుమారుగా రూ.6.24 కోట్లు, జెడ్పీటీసీలకు రూ. 94 లక్షల గౌరవ వేతనం నగదును చెల్లించాల్సి ఉంది.
తమ పార్టీ వారు కాదనే...
ఇదిఇలా ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల్లో దాదాపుగా మోజార్టీ సభ్యులు వైఎస్సార్‌సీపీ వారు ఉండటంతో కనీస గౌరవేతనం విడుదల చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ సానుభూతి పరులు పెద్దగా లేకపోవడంతోనే పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ వారి పదవీ కాలం ముగిసే వరకు కుట్రలు పన్నారని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ప్రతి బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయడం, బిల్లులు పెట్టే సమయంలో ఏదో ఒక కారణంతో మోకాలడ్డడం పరిపాటిగా మారింది. ఇలా గత 28 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ కక్ష సాధింపులకు పాల్పడ్డారు.
24తో ముగుస్తున్న పదవీ కాలం...
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తుంది. అయితే తమను ప్రజా ప్రతినిధులుగా సరైన గుర్తింపు ఇవ్వకుండా గౌరవ వేతనాలను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించి అవమాన పరిచారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం విఫలం
– అనుమోలు శివయ్య,
ఎంపీటీసీ, చెరుకూరు
చంద్రబాబు కుట్రకు నిదర్శనం:
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వారు ఉండటంతో వారి వేతనాలను రెండున్నరేళ్లుగా విడుదల చేయకుండా చంద్రబాబు కక్ష సాధింపులకు పూనుకున్నాడు. చంద్రబాబు కుట్ర రాజకీయాలకు ఇదే నిదర్శనం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ప్రభుత్వంలో సరైన గౌరవ దక్కలేదు. గతంలో ఎన్నిసార్లు ప్రశ్నించినా వేతనం విడుదల చేయలేదు.
– కొండాబత్తిన మాధవరావు,
ఎంపీపీ, పొన్నలూరు


