గిద్దలూరు రూరల్: కుటుంబ కలహాలతో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణ శివారులోని నంద్యాల రోడ్డులోని జగనన్న కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని మోడంపల్లె గ్రామానికి చెందిన ఆగోలు రంగనాయకులు(30) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తి రిత్యా డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్న రంగనాయకులు భార్యతో ఘర్షణపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పొదిలి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి వైద్యశాలలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చీమకుర్తి రాజుపాలెం గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వర్లు(40) కూలి పనులకు పొదిలికి వస్తుంటాడు. ఈ క్రమంలో ఈనెల 18వ తేదీన పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహంపై స్వగ్రామానికి వెళుతుండగా కాటూరివారిపాలెం సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కిందపడిన వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం నిమత్తం మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
సంతమాగులూరు (అద్దంకి రూరల్): భార్యభర్తల మధ్య విభేదాలతో ఎవరివారు విడిగా నివసిస్తున్నా భార్య చనిపోయిందని వార్త తెలుసుకున్న భర్త బంధం వీడినా మానవత్వంలో ఆమె అంత్యక్రియలు చేశారు. చేసిన సంఘటన సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని సజ్జాపురం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుమార్తె అయిన నాగలక్ష్మి (32)కి బైరెడ్డి వెంకట సుబ్బారెడ్డితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం క్రితం నాగలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో భార్యభర్తలు విడిపోయి చట్టపరంగా విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈక్రమంలో ఈనెల 13వ తేదీన ఆ వ్యక్తి ఇంటి వద్ద నాగలక్ష్మి ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 18న చనిపోయింది. అనంతరం గ్రామ పెద్దలు, ఇరువర్గాల కుటుంబ సభ్యులు సూచనల మేరకు వెంకట సుబ్బారెడ్డి భార్య మృతదేహాన్ని తన ఇంటికి తీసుకునిపోయి అంత్యక్రియలు నిర్వహించారు. భార్యాభర్తల బంధాన్ని మరువలేక వెంకట సుబ్బారెడ్డి మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించటంపై గ్రామస్తులు అభినందించారు.


