మెగా చెత్త సేకరణ..! | - | Sakshi
Sakshi News home page

మెగా చెత్త సేకరణ..!

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

ఒంగోలు నగరంలో అసలు సమస్యలను గాలికొదిలేసి అధికారులు, పాలకులు చేస్తున్న ఆర్భాటాలు, ౖపైపె మెరుగులు, పబ్లిసిటీ స్టంట్లపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకెళ్తే.. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా శనివారం నగరంలో మెగా సెగ్రెగేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలంతా తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. అలా అందించిన వారికి రెండు డస్ట్‌బిన్‌లు అందిస్తామని, లక్కీ డ్రా తీసి గోల్డ్‌ కాయిన్‌ ఇస్తామని ప్రకటించారు. మెగా సెగ్రెగేషన్‌ కార్యక్రమంతో వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఒంగోలుకు స్థానం దక్కినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, అదే సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెత్తకుండీల వద్ద పేరుకుపోయిన చెత్త నిల్వలు కనిపించాయి. కొన్నిచోట్ల గాలికి, పశువులు, కుక్కల పీకులాటకు రోడ్ల మీదకల్లా చెత్త చేరిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తడిసిపోయిన చెత్త దుర్వాసన వస్తోంది. దీంతో అటుగా రాకపోకలు సాగించేవారు ముక్కుమూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పలు కాలనీల్లోని రోడ్లతో పాటు ప్రధాన రోడ్ల పక్కన సైతం చెత్త నిల్వలు తొలగించి శుభ్రం చేసే దిక్కు లేకుండా పోయింది. ఇక, నగరంలో కాలువల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపాటి వర్షానికే పొంగిపొర్లి మెయిన్‌ రోడ్లపై కూడా మురుగునీరు నిలుస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. చెత్త, మురుగు వంటి పారిశుధ్య లోపాలతో పాటు నగరంలోని రోడ్లపై గుంతలు, దుమ్ము, ధూళి, ట్రాఫిక్‌ సమస్యలతో నగరవాసులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇవన్నీ పట్టని అధికారులు, పాలకులు.. 150 ఏళ్ల ఉత్సవాలంటూ మొక్కుబడి కార్యక్రమాలు నిర్వహించి ఫొటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని నగరవాసులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ౖపైపె మెరుగులు, రంగులు, ప్లాస్టిక్‌ బొమ్మలు వంటి హంగులకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని, ప్రధాన సమస్యలను మాత్రం గాలికొదిలేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆర్భాటాలు పక్కనపెట్టి అసలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు.

ఇదేనా..

– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, ఒంగోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement