రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో కొండపి నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క అధికారినీ వదలను దోపిడీలో పోటీ పడుతున్న స్వామి, సత్య మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
కొండపి: రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటుకు ప్రకృతికి కూడా వణుకు పుట్టి వెనకకు వెళ్లిపోతుందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. మండలంలోని అనకర్లపూడి గ్రామంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చౌదరి యువసేవా సమితి, వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహం వద్ద నిర్వహించిన కోలాట ప్రదర్శనను తిలకించిన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ కోలాట ప్రదర్శనకు అనుమతులు ఇవ్వడానికి కూడా పోలీసులు ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతున్న నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలోని మాజీ సర్పంచ్ భువనగిరి సత్యనారాయణకు చెందిన ప్రహరీని పూర్తిగా ధ్వంసం చేసి రూ.ఐదు లక్షల నష్టం చేశారని, కేసు నమోదు చేయడానికి పోలీసులు ముందుకు రాలేదన్నారు. అదేవిధంగా పెట్లూరు గ్రామానికి చెందిన కల్లూరి హరిబాబు బొప్పాయి పంటను సాగు చేస్తుంటే టీడీపీకి చెందిన వ్యక్తులు చేతికంది వచ్చిన బొప్పాయి పంటను పూర్తిగా ధ్వంసం చేస్తే కేసు నమోదు చేయడానికి వెనుకంజ వేశారని, మహిళ రైతు బాధ వర్ణనాతీతం అని విమర్శించారు. జాళ్లపాలెంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఏర్పాటు చేసుకున్న రచ్చబండను, 30 ఏళ్ల నాటికి వేప చెట్టును కూల్చివేసిన బాధితులపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండదని, తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే అని, ఎవరెక్కడ ఉన్నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని మా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పారని అదే పరిస్థితి నియోజకవర్గంలో కూడా ఉంటుందన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు వైఎస్సార్ పునాదివేసి పనులు వేగంగా కొనసాగించారని, అలాగే ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మిగతా పనులను పూర్తి చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో 90 శాతం పనులు వైఎస్ కుటుంబ సభ్యులు మాత్రమే పూర్తి చేశారని ఈ విషయంపై చర్చకు నేను సిద్ధమని ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో చర్చలో తేల్చుకుందాం రమ్మని సవాలు విసిరారు.
దోపిడీలో పోటీపడుతున్న మంత్రి స్వామి, సత్య
నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులుగా చలాయిస్తున్నారని ఒకరికి క్యాబినెట్ హోదా అని, మరొకరికి మంత్రి కానీ మంత్రి హోదా అని విమర్శించారు. ఇసుక, మట్టి, గ్రావెల్, రేషన్ మాఫియా నియోజకవర్గంలో చెలరేగుతోందన్నారు. నెలకు రూ.కోట్లలో ఆదాయాన్ని తమ జేబుల్లోకి వేసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి పక్కనే ఉన్న రామాయపట్నం పోర్టును అమ్మకానికి పెట్టిన ఘనత మారిటైం బోర్డు చైర్మన్ సత్యాకి మాత్రమే చెందుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో పోటీ చేసి విజయ బావుటా ఎగరవేయడానికి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పొగాకు రైతుకు మద్దతు ధర లేక అల్లాడిపోతూ ఇబ్బందులను ఎదుర్కొంటే కూటమి ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు విమర్శించారు. రైతుల కళ్లల్లో ఆనందం కోసం వైఎస్ కుటుంబం పనిచేస్తుందని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని ఇది కేవలం దగా డీఎస్సీ అని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య విమర్శించారు. దగా డీఎస్సీకి కారణమైన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. మాజీ మంత్రి సురేష్, చుండూరి రవి, మాదాసి వెంకయ్యలకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం కోలాట ప్రదర్శన చేసిన వారికి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు, మర్రిపూడి మండల కన్వీనర్ ఇనకొల్లు సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్, మాజీ సర్పంచ్ వేముల ధనలక్ష్మి, భువనగిరి సత్యనారాయణ, చింతల ఎక్స్‌పోర్ట్స్ అధినేత చింతల వెంకటేశ్వర్లు, మండవ మాలకొండయ్య, వేముల రమేష్, మోపర్తి నారాయణ, గౌరెడ్డి రవాణారెడ్డి, సుబ్బయ్య, చింతల వెంకటేశ్వర్లు, మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వసంత్, సుల్తాన్ నజీర్, నాగిరెడ్డి, శ్రీహరిబాబు, సుధాకర్, విజయరామరాజు, వెంకట నర్సు, బొల్లా సుబ్బారావు, మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, చౌదరి యువసేవ సమితి యువత, మహిళలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


