కరువు సీఎం చంద్రబాబు.. | - | Sakshi
Sakshi News home page

కరువు సీఎం చంద్రబాబు..

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

జిల్లాలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలి రైతులకు రుణ మారటోరియం ఇవ్వాలి ఉచిత పంటల బీమా, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పశుగ్రాసం అందించాలి బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవిబాబు డిమాండ్‌

ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. జిల్లాలో కరువు పరిస్థితులను వెంటనే అంచనా వేసి కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబుతో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షాలు లేక తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. వర్షాభావంతో పత్తి, పొగాకు, ఉద్యాన పంటలతో పాటు మెట్ట, మాగాణి సాగుపైనా ప్రభావం పడుతోందని తెలిపారు. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉందని, ఇతర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

రైతులపై రుణభారం...

పంటలు సరిగా పండక రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. బ్యాంకు రుణాల చెల్లింపులకు మారటోరియం ప్రకటించి, పాత రుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు. కొత్త రుణాలు అందేలా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వర్షాలు కురిసి పంటలు వేసుకునే అవకాశం ఏర్పడితే రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పశుగ్రాసం, పశువుల దాణా అందించాలన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా అందించామని, అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత బీమాను ఎత్తేసి బీమా కవరేజీ కూడా తగ్గించారని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి ప్రీమియం భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కొంత నీటిని విడుదల చేసి జిల్లా మొత్తం సస్యశ్యామలమైందన్న బోగస్‌ ప్రచారానికి బదులుగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించాలన్నారు.

కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు ఏవీ..?

వర్షాభావ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరువు పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే కరువు పరిస్థితులపై సర్వే నిర్వహించి, అర్హత ఉన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కరువు రాష్ట్రానికి కొత్తేమీ కాదు.. చుండూరి రవిబాబు

కరువు రాష్ట్రానికి కొత్తేమీ కాదని ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పంటలు పండకపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, రైతులు అప్పుల పాలవడం వంటి సమస్యలను గతంలో చూశామన్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాలు, అభివృద్ధి పనులకు పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు తదితర వర్గాలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వాలు చేపట్టిన పనులను ప్రారంభిస్తూ వాటిని తమ ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప కొత్తగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. మంచినీళ్లు దొరకవు కానీ.. సారాయి మాత్రం ప్రతి వీధి చివర దొరుకుతోందన్నారు.

కరువులోనూ టీడీపీ నాయకులకు లాభాలే..

టీడీపీ నాయకులు నీళ్లను, చెరువుల్లో మట్టిని, ఎండిన వాగుల్లో ఇసుకను అమ్ముకుంటారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన కరువు వల్ల ప్రజలకి ఎంతో నష్టమైతే, వాళ్ల నాయకులకు మాత్రం లాభసాటి వ్యాపారమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ వైద్యంపై నమ్మకం లేక ప్రజలు ప్రైవేట్‌ వైద్యం వైపు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావడం లేదని రవిబాబు అన్నారు.

కరువు పరిస్థితులకు బాధ్యత వహించాలి..

కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు లేవని, ఆంధ్రప్రదేశ్‌లోనే తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని రవిబాబు అన్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టి రైతులు, కార్మికులు, సామాన్య ప్రజలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు, పోలీసు చర్యలతో అణచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై సమగ్రంగా విచారణ జరపాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు వైవీ గౌతమ్‌ అశోక్‌, మాజీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొల్లాటి ఏడుకొండలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు పులుసు సురేష్‌బాబు, దేవరపల్లి రమణయ్య, మలిశెట్టి దేవా, సన్నీ, వెంకు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement