ఎల్లో | - | Sakshi
Sakshi News home page

ఎల్లో

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

న్యూస్‌రీల్‌

వర్షాభావానికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగు సంక్షోభం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సాధారణ సాగులో ఐదో వంతుకే పరిమితం కరువు సన్నద్ధత చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం విఫలం సాగు, తాగునీటికి కటకట

కంది.. పత్తికి భారీ దెబ్బ

ఉద్యాన పంటలకూ తిప్పలు

ఖరీఫ్‌ను కాటేసిన

చినుకు జాడలేక..సర్కారు చేయూత కరువై అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వర్షాభావ పరిస్థితులపై సమాచారం ఉన్నా వాటిని ఎదుర్కోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సాగు సంక్షోభంలో పడింది. సాగుకు నీరు లేక వేలాది హెక్టార్లు బీడువారగా.. తాగునీరు లేక ఉమ్మడి జిల్లా ప్రజల గొంతెండుతోంది. జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించి సత్వరం ఆదుకోవాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మార్కాపురం: ఖరీఫ్‌ సీజన్‌పై కరువు పంజా విసిరింది. ప్రకృతి ప్రకోపానికి తోడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జూన్‌ నుంచి సెప్టెంబరు ప్రారంభం వరకు సాధారణం కంటే సగానికిపైగా వర్షపాతం లోటు నమోదవడంతో వర్షాధార పంటల సాగు గణనీయంగా తగ్గిపోయింది. పంటలు సాగు చేసిన ప్రాంతాల్లోనూ తేమ కొరత వెంటాడుతుండటంతో దిగుబడులపై రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోయినా ప్రభుత్వం ఇంతవరకూ కరువు సహాయక చర్యలు ప్రకటించలేదు. దీనితో రైతులు నష్టాల బారిన పడ్డారు.

వేలాది హెక్టార్లు బీడు:

వర్షాభావం కారణంగా మార్కాపురం జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 85,577 హెక్టార్లు కాగా, సెప్టెంబరు 9 నాటికి కేవలం 20,817 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. మరో 64,760 హెక్టార్లు సాగుకు నోచుకోకుండా బీడుగా మిగిలిపోయాయి. గతేడాది ఇదే సమయంలో సాగు విస్తీర్ణం సుమారు 79 శాతంగా ఉండగా, ఈసారి తీవ్రంగా పడిపోయింది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సుమారు 1.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం సుమారు 11 వేల ఎకరాల్లో సాగయ్యాయి. ఒకవైపు సాగు విస్తీర్ణం భారీగా తగ్గగా, మరోవైపు సాగైన పంటలను కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. సెప్టెంబరు చివరి దశలోనైనా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి భూమిలో తేమ పెరిగితే కొంతమేర పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.

మెట్ట రైతులకు కన్నీళ్లే..

మార్కాపురం జిల్లాలో అధికశాతం ప్రాంతాలు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, కొనకనమిట్ల, కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల్లో వర్షాధారంగా పంటలు సాగవుతున్నాయి. జూన్‌లోనే విత్తనాలు వేసేందుకు సిద్ధమైన రైతులు వాన కోసం ఎదురుచూస్తూ కాలం గడిపారు. తర్వాత వచ్చిన కొద్దిపాటి వర్షాలకు కొందరు రైతులు విత్తనాలు వేసినా, ఆ తర్వాత తగినంత తేమ అందక పంటలు ఎదుగుదల కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కంది, పత్తి, మిరప, మొక్కజొన్న తదితర పంటల సాగుపైనా వర్షాభావ ప్రభావం పడింది. పంట సాగు చేసిన రైతులు కూడా పెట్టుబడులు పెట్టిన తర్వాత వర్షం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆహార ధాన్యాలపై ప్రభావం:

ఖరీఫ్‌ సాగు తగ్గిపోవడంతో స్థానికంగా లభించే పంట ఉత్పత్తిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఇతర వర్షాధార పంటల దిగుబడులు తగ్గితే రైతుల ఆదాయంతో పాటు మార్కెట్‌కు వచ్చే వ్యవసాయ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ప్రధానంగా వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది. మార్కాపురం జిల్లాలో 7240 హెక్టార్లకు గాను కేవలం 1402 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సజ్జ, కంది పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో ఈ ఏడాది బియ్యం ధరలు పెరగనున్నాయి.

రైతులపై పెట్టుబడి భారం:

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెట్టిన తర్వాత వర్షం లేకపోవడంతో రైతులకు పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అన్న అనుమానం నెలకొంది. ఎకరా పత్తి సాగుకు సుమారు రూ.15 నుంచి రూ.20 వేలు ఖర్చుపెట్టారు. వరికి కూడా ఇదే స్థాయిలో ఖర్చువచ్చింది. అయితే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. పంటలను కాపాడుకునేందుకు బోర్లు, బావుల ద్వారా నీరు అందించే రైతులపై అదనపు విద్యుత్‌ ఖర్చులు పడుతున్నాయి.

రైతులపై రుణభారం...బీమా మాయం

బ్యాంకు రుణాల చెల్లింపులకు మారటోరియం ప్రకటించి, పాత రుణాలను వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పిస్తేనే రైతులు ఊపిరి పీల్చుకోగలుగుతారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా అందించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత బీమాను ఎత్తేశారు. బీమా ప్రీమియం భారాన్ని రైతులపై వేశారు. బీమా చేయించుకున్నా.. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం దక్కలేదు. వర్షాలు లేక వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీలకు పనులు లేక వలస వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ఉచిత పంటల బీమాను అమలు చేయడంతో పాటు నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. జిల్లాలో కరువు పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించి, అర్హత ఉన్న వాటిని కరువు మండలాలుగా ప్రకటించి రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

ఎల్లోనినో..

వర్షాభావం కొనసాగితే పంట దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని అధికారులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంది సాధారణంగా ఎకరాకు ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి ఇచ్చే పరిస్థితి ఉండగా, ప్రస్తుత తేమ ఒత్తిడితో అర క్వింటాల్‌కు పడిపోయే అవకాశం ఉందని రైతులు తెలిపారు. పత్తి దిగుబడి కూడా సాధారణంగా ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల వరకు ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి, రెండు క్వింటాళ్లకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు.

కరువు ప్రభావం కేవలం మెట్ట పంటలకే పరిమితం కాలేదు. ఉద్యాన పంటల సాగుపైనా ప్రభావం పడింది. నారింజ, నిమ్మ వంటి పంటల్లో తేమ ఒత్తిడితో కాయ పరిమాణం తగ్గడం, రసం శాతం పడిపోవడం, ఎండదెబ్బ, చీడపీడలు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అరటి, మిరప పంటలకు కూడా వాతావరణ పరిస్థితులు సవాలుగా మారాయి.

ఖరీఫ్‌ పోయినట్టే

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ పోయినట్టే. వర్షాలు లేక బోర్లు పనిచేయక వేసిన పత్తి, వరి పంటలు ఎండిపోతున్నాయి. సజ్జ పరిస్థితి కూడా అలాగే ఉంది. కంది దిగుబడులు కూడా తగ్గనున్నాయి. మా గ్రామంలో మొత్తం రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. పెట్టుబడులు కూడా రాక ఇబ్బందులు పడుతున్నాం.

– మురళీ, గారపెంట, పుల్లలచెరువు మండలం.

ఇలా జరుగుతుందనుకోలేదు

ఇంతటి దారుణమైన పరిస్థితులను నెనెప్పుడూ చూడలేదు. వర్షాలు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయి. బోర్లలో నీళ్లు కూడా రావడంలేదు. కళ్లెదుటే వేసిన పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతుంది. సెప్టెంబరు 3వ వారం వస్తున్నా వర్షాలు లేవు. ఎల్‌నినో అంటే ఏదో అనుకున్నాం. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాట్రగుంట, కొనకనమిట్ల మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement