ఆన్‌లైన్ రిటైర్మెంట్ ప్రక్రియతో
ఉద్యోగులకు ఇక్కట్లు
ఈ–ఎస్‌ఆర్‌తో సరి..
ఒంగోలు సిటీ:
సర్వీస్ రికార్డులను డిజిటలైజ్ చేసే ఈ–ఎస్‌ఆర్ ప్రక్రియ ఉద్యోగులకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. ఒక వైపు ఉద్యోగుల జిల్లాల కేటాయింపు, ఆర్థిక సమస్యలు పరిష్కారం కాకపోవడం వంటి సమస్యలు ఉండగా మరో వైపు ఈ–ఎస్‌ఆర్‌లో రోజుకో కొత్త ప్రక్రియ అమలు చేయాలని ఆదేశాలు రావడంతో అదనపు పని భారం పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. రోజూ కొత్త పని..వెంటనే పూర్తి చేయాలనే ఆదేశాలు.. బోధన కంటే ఆన్‌లైన్ ప్రక్రియలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఒకే విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిసి సుమారు 41,500 మంది ఉన్నారు.
తొలుత జీవిత భాగస్వామి వివరాలు
ప్రస్తుతం ఈ–ఎస్‌ఆర్ ప్రక్రియలో భాగంగా నిధి లాగిన్‌లో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్‌లో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాల్సి ఉంది. అయితే ముందుగా జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేసి ఈకేవైసీ ద్వారా నిర్థారించుకోవాలి. అనంతరం సంబంధిత డీఈఓ ఆ వివరాలను ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. డీడీఓ కన్‌ఫర్‌మేషన్ పూర్తయ్యే వరకు ఇతర కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసే అవకాశం ఉండదని ఉద్యోగులకు సూచనలు అందుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు జీవిత భాగస్వామి వివరాలు నమోదు చేయని ఉద్యోగులు ముందుగా ఆ వివరాలను ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్‌లో నమోదు చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి వస్తోంది. తర్వాత డీడీవో స్థాయిలో ధ్రువీకరణ పూర్తయితేనే తదుపరి ప్రక్రియకు వెళ్లే పరిస్థితి ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు.
ఉద్యోగి..డీడీవో ఇద్దరికీ పని
ఈ ప్రక్రియ ఉద్యోగి స్ధాయిలో వివరాలు నమోదు చేయడంతోనే పూర్తికాదని, అనంతరం డీడీవో వాటిని పరిశీలించి ఓటీపీ ద్వారా ఆమోదించాల్సి ఉంటుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్‌లో వివరాలు పూర్తిగా అప్‌డేట్ చేసి డీడీవో ధృవీకరణ అనంతరమే ఈ–ఎస్‌ఆర్‌లో తదుపరి ప్రక్రియకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.
రోజుకో కొత్త ఆదేశంతో అయోమయం
ఒకే ప్రక్రియకు సంబంధించి తరుచూ కొత్త సూచనలు, కొత్త ఫార్మాట్లు రావడంతో అయోమయం నెలకొంటుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ వివరాలను ఎక్కడ నమోదు చేయాలి? ఏ ఫొటోను ఏ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి? ఫొటో పరిమాణం ఎక్కువగా ఉంటే దానిని ఏ యాప్ ద్వారా తగ్గించాలి? గూగుల్ ఫార్‌మ్స్ ఎలా సబ్మిట్ చేయాలి? వాటి స్క్రీన్ షాట్లు ఎక్కడ పంపాలి? వంటి పనులు కూడా ఉద్యోగుల బాధ్యతగా మారుతున్నాయని పేర్కొంటున్నారు.
బోధన కంటే యాప్‌లపైనే దృష్టి
పాఠం ఎలా బోధించాలి.. విద్యార్ధుల అభ్యసన సామర్థ్యాన్ని ఎలా పెంచాలి అనే అంశాలపై దృష్టి పెట్టాల్సిన ఉపాధ్యాయులు ప్రస్తుతం యాప్‌ల్లో వివరాలు నమోదు చేయడం, ఫొటోలు అప్‌లోడ్ చేయడం, సైజులు మార్చడం, ఫార్‌మ్స్ సబ్మిట్ చేయడం, స్క్రీన్‌షాట్లు పంపడంతోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు.
రోజుకో కొత్త కార్యక్రమం
ప్రతిదీ వెంటనే పూర్తి చేయాలన్న ఆదేశాలతో బోధనేతర పనుల భారం మరింత పెరుగుతోందని పేర్కొంటున్నారు. ఉద్యోగులపై భారం పడకుండా ఈ–ఎస్‌ఆర్ ప్రక్రియకు సంబంధించి ఒకే స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పైస్థాయి అధికారులు తరుచూ మారుతున్న సూచనల స్థానంలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసి అవసరమైన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల జిల్లాల కేటాయింపు, ఆర్థిక అంశాలు వంటి ప్రధాన సమస్యలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ–ఎస్‌ఆర్ అప్‌డేట్‌తో ఉద్యోగులకు కొత్త తలనొప్పులు
రోజుకో కొత్త నిబంధనతో పనిభారం పెరిగి ఒత్తిళ్లు
బోధనపై దృష్టి పెట్టలేకపోతున్న ఉపాధ్యాయులు
యాప్‌ల్లో అప్‌లోడ్‌లతో తిప్పలు
పదవీ విరమణ ప్రయోజనాలైన పెన్షన్, జీపీఎఫ్, ఎర్న్‌డ్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర అంశాలపై ఉద్యోగులకు పూర్తి అవగాహన కల్పించకుండానే కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలని ఆదేశాలు జారీ చేయడం ఇబ్బందులకు దారితీస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 1, 2026 నుంచి ఆన్‌లైన్ విధానం అమల్లోకి రావడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు భౌతిక దరఖాస్తు విధానాన్ని కూడా ఆప్షనల్‌గా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


