పెద్దారవీడు: మండలంలో తోకపల్లి నుంచి రాజంపల్లి గ్రామం వెళ్లే రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం మంగళవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు పొలంలో మహిళ మృతి చెందినట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 50 నుంచి 60 ఏళ్లు ఉంటాయని, పసుపు రంగు డిజైన్ కలిగిన చీర, ఎరుపు రంగు లంగా, పచ్చ రంగు జాకెట్ ధరించి ఉందని ఎస్సై సైదుబాబు తెలిపారు. ఈ వివరాలు కలిగిన మహిళ ఎవరైనా గత కొన్ని రోజులు కనిపించకుండా తప్పి పోయినట్లయితే, ఆమె కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెంటనే పెద్దారవీడు ఎస్సై ఫోన్ 9121102186, త్రిపురాంతకం సీఐ ఫోన్ 9121102237, ఎర్రగొండపాలెం (ఇన్‌చార్జి) సీఐ 9121102192 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
సీఎస్‌పురం(పామూరు): బాల్య వివాహాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కే.దేవకృపావరం హెచ్చరించారు. మండలంలోని రెడ్డిగారిపల్లె గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కె.దేవకృపావరం, ఎన్‌జీఓ షేక్.నాయబ్‌రసూల్, మహిళాపోలీస్ నాగమణి బాలిక ఇంటికి చేరుకొని తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహం నేరమని, అలా చేస్తే రూ.లక్ష జరిమానా, రెండేళ్ల జైలుశిక్ష విస్తామని కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. పంచాయతీ కార్యదర్శి గుర్రం బాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ పి.మస్తాన్‌రావు, అంగన్‌వాడీ కార్యకర్తలు రమణమ్మ, అంకమ్మ పాల్గొన్నారు.
● రూ. 29, 24,898 ఆదాయం
టంగుటూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన వల్లూరమ్మ ఆలయంలో మంగళవారంహుండీలను దేవదయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 145 రోజులకు గాను 10 హుండీలను లెక్కించగా రూ. 29,24,257 ఆదాయం వచ్చింది. అలాగే 15 గ్రాముల బంగారం, 11 గ్రాముల వెండి, 2 అమెరికా డాలర్లు, యుగండా స్విల్లింగ్లు 20 వేల రూపాయలు వచ్చాయని ఆలయ ఈఓ బి. రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ బొజ్జా శ్రీనివాసులు, ధర్మకర్తలు మొలకలపల్లి లక్ష్మి నారాయణ, సనగర రాజేష్, తక్కెలపాటి వెంకయ్య, జూనియర్ సహాయకుడు కొయా మోహనరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది, తెనాలి వాసవి సేవా సమితి, కందుకూరు శ్రీవారు సేవ సమితి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఒంగోలు ప్రత్యేక రెండో తరగతి, రెండో కోర్టు మేజిస్ట్రేట్ వై కళావతి మంగళవారం తీర్పు చెప్పారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డు జంక్షన్ సమీపంలో, కర్నూలు రోడ్డు ప్లైఓవర్ సమీపంలో మద్యం తాగి వాహనాల నడుపుతున్న వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిలో ఇద్దరికి 10 రోజుల జైలు శిక్ష విధించారు. మరో 11 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.


