ఒంగోలు సబర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సంసిద్ధం కావాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పంచాయతీ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్‌లతో మంగళవారం స్థానిక ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఇంటింటా సర్వే ప్రక్రియ సమర్థంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. 514 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా, 5,847 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. 10,70,670 ఓటర్లు ఆయా పంచాయతీలో ఉన్నారని వివరించారు. ఇందు కోసం మంగళవారం నుంచి 22వ తేదీ వరకు సర్వే జరుగుతుందన్నారు. ఈ నెల 23 నుంచి 24వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓటర్ల గుర్తింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. 25వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు. 26 నుంచి 28వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ సాగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల విచారణ ప్రక్రియ 29 నుంచి సెప్టెంబర్ రెండో తేదీ వరకు సాగుతుందన్నారు. సెప్టెంబర్ మూడు నుంచి ఆరో తేదీ వరకు ఓటర్ల జాబితా పరిశీలన, ధ్రువీకరించడం వంటి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది జాబితా విడుదల చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఈ విషయాలను చేరవేయాలన్నారు. పునర్విభజనతో ఏర్పడిన నూతన డివిజన్‌లు, వార్డుల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల వద్ద నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని లిఖితపూర్వకంగా దస్త్రాల్లో పొందుపరచాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమర్ధంగా నిర్వహించాలని చెప్పారు. కోర్టు కేసులో ఉన్న వాటిని మినహాయించి, మిగిలిన వాటిల్లో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలన్నారు.
ఒంగోలులో డీ లిమిటేషన్ ద్వారా
62 డివిజన్లు...
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 డివిజన్‌లు ఉండగా, డీలిమిటేషన్ ద్వారా 62 డివిజన్‌ల ఏర్పాటుకు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో స్వల్ప మార్పు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అదనంగా బ్యాలెట్ బాక్స్‌లు సమకూర్చుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలను నియమించుకోవాలని సూచించారు. సెప్టెంబర్ మూడో తేదీ నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయాలని, కందుకూరులో ప్రస్తుతం 30 వార్డులు ఉండగా, డీలిమిటేషన్ ద్వారా 10 వార్డులు అదనం కానున్నాయన్నారు. చీమకుర్తిలో 20 వార్డులుఉండగా, డీలిమిటేషన్ ద్వారా 22కు పెరిగే అవకాశం ఉన్నందున అందుకు సరిపడా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. దర్శిలో డీ లిమిటేషన్ ద్వారా 20 నుంచి 28 వార్డులకు, అద్దంకిలో 20 నుంచి 32 వార్డులకు పెరుగుతుందన్నారు. ఆ మేరకు అధికారులు సంసిద్ధం కావాలని ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఎం.అనుపమ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ బాలమ్మ, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, దర్శి కమిషనర్ అర్జున్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 514 పంచాయతీలకు ఎన్నికలు
ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల్లో పెరిగిన డివిజన్ల వారీగా ఏర్పాట్లు చేయాలి
ఓటర్ల ఇంటింటి సర్వే ప్రక్రియ సమర్ధంగా చేపట్టాలి
అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజాబాబు


