అద్దంకి ఘటనపై హైకోర్టులో కేసు వేస్తాం.. | - | Sakshi
Sakshi News home page

అద్దంకి ఘటనపై హైకోర్టులో కేసు వేస్తాం..

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

అద్దంకి: అద్దంకి ప్రాంతంలో గంజాయి రవాణా ఘటనపై ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపించాలని, కారులో పోలీసులు గంజాయి తరలిస్తున్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలపై కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేందర్రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్లికురవ గ్రానైట్‌ అక్రమ రవాణాకు సహకరించినందుకు ఏర్పాటు చేసిన మద్యం పార్టీలో పాల్గొని శంఖవరప్పాడు వద్ద జరిగిన కారు ప్రమాదంలో మద్యం బాటిళ్లు, పెద్ద ఎత్తున డబ్బు, గంజాయితో సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజులు ప్రజలకు పట్టుబడ్డారన్నారు. అద్దంకి సీఐ సుబ్బరాజు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ఎస్సైలను తప్పించారని ఆరోపించారు. పోలీస్‌లను రక్షించేందుకు దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఖాకీ కథలు చెప్పారని మండిపడ్డారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న కారులో దొరికిన గంజాయి, మద్యంఎవరివో, ఎక్కడివో చెప్పాలన్నారు. మద్యం బాటిళ్లు క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా ఏ షాపుల్లో కొన్నారో కూడా తేల్చాలన్నారు. ప్రతిపక్షాలను గంజాయి బ్యాచ్‌..అని హేళన చేస్తున్న ముఖ్యమంత్రి తన అనుచరుడైన విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి నియోజకవర్గంలో గంజాయి రవాణా విషయమై స్పందించాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర విచారణ నిర్వహించి ఎస్సైలు దోషులుగా తేలితే వారిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీస్‌ అధికారుల అనైతిక అక్రమ వసూళ్ల దందాను అరికట్టేందుకు ఎస్పీ కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటున్న కూటమి పాలనలో పోలీస్‌ అధికారుల అక్రమ వసూళ్ల దందా, గంజాయి రవాణాపై హైకోర్టులో పిల్‌ వేస్తామని నీలం స్పష్టం చేశారు. సమావేశంలో మాలమహానాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి. మాలసభ కన్వీనర్‌ మేడికొండ మురళి, యరమాల శ్రీను పాల్గొన్నారు.

గంజాయి రవాణాపై సమగ్ర విచారణ జరపాలి

దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement