● కలెక్టర్ విజయసునీత
మార్కాపురం టౌన్: వెలిగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల సమస్యలపై మార్కాపురం కలెక్టరేట్ ఎం విజయసునీత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వెలుగొండ ప్రాజెక్ట్ ఎస్‌ఈ అబూద్ ఆలీ, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్‌కుమార్, ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
కంభం: రైలు కిందపడి మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన స్థానిక కంభం రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే..కంభంలోని వాసవీ స్కూల్ సమీపంలో నివాసముంటున్న చాట్ల క్‌లైమ్(23) గత కొంత కాలంగా మతి స్థిమితం సక్రమంగా లేకపోవడంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం నంద్యాల వైపు వెళ్లే గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో నగర విద్యార్థిని గుంటూరి పూజిత సత్తా చాటింది. రెండు రోజుల కిందట విడులైన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆమె ఆలిండియా 8వ ర్యాంకు సాధించింది. పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన గుంటూరి పూజిత నగరంలోనే ఉంటూ సీఎంఈ విద్యనభ్యసిస్తోంది. సీఎంఏ ఫౌండేషన్‌లో సైతం ఆలిండియా 16వ ర్యాంకు సాధించిన ఆమె, ఇంటర్‌లోనూ సత్తా చాటడంతో పలువురు అభినందనలు తెలిపారు.
ఒంగోలు టౌన్: ఒంగోలు రైల్వేస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు– కొత్తపట్నం ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి కింద రైలు ఢీకొనడంతో సుమారు 55 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. ఛామన ఛాయ కలిగిన, 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. లైట్ బిస్కట్ కలర్ చొక్కా, నలుపు రంగు ప్రింటెడ్ లుంగీ ధరించి ఉన్నాడు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరాం తెలిపారు.
లింగసముద్రం: మహిళను వేధించిన కేసులో వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.3,,500 జరిమానా విధించినట్లు ఎస్సై రాంబాబు తెలిపారు. వివరాల్లోకి వెళితే..అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మహిళను ఆమె ఇంటి ముందు ఉన్న చింత జగదీష్ అసభ్యకరంగా మాట్లాడి దుర్భాషలాడటంతో 2019 నవంబర్‌లో లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కందుకూరు కోర్టులో కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జగదీష్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.3,500 జరిమానా విధించారు. జరిమానా కట్టలేని పక్షంలో మరూ మూడు నెలల జైలుశిక్ష ఉంటుందని జడ్జి తీర్పు ఇచ్చారు.
● సచివాలయ ఉద్యోగి మృతి
త్రిపురాంతకం
(యర్రగొండపాలెం): పట్టుమని మూడు పదుల వయసు నిండకముందే గుండెపోటుతో ఓ సచివాలయ ఉద్యోగి మృతి చెందారు. వివరాలు.. త్రిపురాంతకం మండలంలోని దూపాడు సచివాలయం–2లో డి.గంగాధర్ (27) డిజిటల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కాపురంలో నివాసం ఉండే ఆయన రోజూ మాదిరిగానే గురువారం విధులకు హాజరయ్యేందుకు బస్సులో దూపాడు వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే బస్సులో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చేరుకుని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో, మార్కాపురంలో ఉన్న తన తమ్ముడికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


