టంగుటూరు: రొయ్యల చెరువుల వద్ద రొయ్యల మేత బ్యాగులను దొంగలించి ఆటోలో తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్సై ఫణిభూషణ్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ ఉదయం 6 గంటలకు మండలంలోని కేసుపాలెం గ్రామంలో దిలీప్‌కు చెందిన రొయ్యల చెరువు వద్ద 8 బస్తాల రొయ్యలు దొంగలించినట్లు బాధితులు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్‌ఐ ఫణి భూషణ్ గురువారం ఆటోలో వెళుతున్న నలుగురు నిందితులు వాయిల స్వామి, డిబయ గమాంగో ఎలాష్ గమాంగో, షేక్ హరుణ్ రషీద్ అనే వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి 8 బస్తాల రొయ్యల మేతను స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ అనే నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. నిందితుల నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను సింగరాయకొండ కోర్టులో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
ఒంగోలు టౌన్: ఇంటి నుంచి వెళ్లిన ఒక యువకుడు ఐదు రోజుల తరువాత వాగులో శవమై తేలాడు. పోలీసుల కథనం ప్రకారం.. త్రోవగుంటకు చెందిన అరుణ్ కుమార్ (28) రాడ్ బెండింగ్ పనిచేస్తుంటాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ దగ్గర నివసిస్తున్నాడు. అవివాహితుడైన అరుణ్ కుమార్ తరుచుగా మద్యం తాగి తిరుగుతుంటాడు. ఆదివారం ఉదయం నుంచి కనిపించక పోయే సరికి కుటుంబసభ్యులు గాలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని ముదిగొండ వాగులో శవమై తేలాడు. ఆత్మహత్యా, ప్రమాదమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


