● కలెక్టర్ రాజాబాబు
జె.పంగులూరు: గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుని, అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే పరిష్కరించడమే శ్రీపల్లె నిద్రశ్రీ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. మండలంలోని తూర్పు కొప్పెరపాడులో బుధవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 13 పల్లె నిద్రలు నిర్వహించామని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మండలంలోని 21 గ్రామాలకు 21 మంది జిల్లా స్థాయి అధికారులను పంపి సమస్యలు సేకరించామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గర్భిణులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, డీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ నారాయణరావు, సీపీవో టి.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


