మార్కాపురం: ‘ ఏం తమాషాగా ఉందా.. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకోరా.. ’ అంటూ అధికారులపై జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం దళితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌కు ఇంతియాజ్, చిన్నా, లింగమయ్య, మరికొంత మంది కలిసి భ్రమర వెంచర్స్‌లో జరుగుతున్న గొడవలు, దాడులను వివరిస్తూ న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను తన వద్దకు రావాలని ఆదేశించారు. అయితే ఉన్నత స్థాయి అధికారి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలపై తనకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ శివారులోని భ్రమర వెంచర్ సమీపంలో తమకు 3.53 సెంట్ల భూమి ఉందని, ఆ భూమికి వెళ్లే దారిని వెంచర్ యాజమాన్యం అక్రమంగా ఇనుప కంచె, గేటు నిర్మించి మూసివేస్తోందని బాధితులు ఆరోపించారు. గేటు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వెళ్లగా వెంచర్ మేనేజర్‌తో పాటు మరికొందరు తమపై దాడి చేసి కుల, మత దూషణలకు పాల్పడ్డారని, రాడ్లు, కట్టెలతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి తమకు రక్షణ కల్పించాలని జేసీకి వినతిపత్రం అందజేశారు. భూమికి వెళ్లే దారిని మూసివేసేందుకు ఎలాంటి అనుమతులు ఇచ్చారని ఇరిగేషన్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ఈ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనలపై పూర్తి వివరాలతో విచారణ జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను జేసీ ఆదేశించారు. మరోవైపు, దాడి ఘటనపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
క్షేత్రస్థాయికి వెళితేనే సమస్యల పరిష్కారం
మార్కాపురం టౌన్: క్షేత్రస్ధాయిలో అధికారులు పర్యటించినప్పుడే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 527 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 155, ఇతర సమస్యలపై 372 వచ్చినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిస్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి పని చేయాలన్నారు. పరిష్కరించదగ్గ వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమస్యపై పదేపదే తిప్పుకోవడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఇప్పటికై నా అన్ని శాఖల అధికారులు పద్ధతి మార్చుకొని పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్ కుమార్, హౌసింగ్ పీడీ మోహన్ రావు, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌ఆర్ ప్యాకేజీలో అన్యాయం:
పెద్దారవీడు మండలం సుంకేశుల గ్రామానికి చెందిన గుడ్డెపోగు సుబ్బులు ఆర్‌ఆర్ ప్యాకేజీలో పేరు లేదని పీజీఆర్‌ఎస్‌లో విన్నవించారు. 2006లో విడుదల చేసిన గెజిట్ లిస్టులో తన పేరులేదని, అప్పటికే తనకు 18 సంవత్సరాలు నిండాయని చెప్పారు. తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, ఆర్‌ఆర్ ప్యాకేజీ గెజిట్ లిస్టులో తన పేరు నమోదు చేసి న్యాయం చేయాలని కోరాడు.
గుడ్డెపోగు సుబ్బులు


