ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించకుండా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల
గొంతెండుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాడు–నేడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను పక్కాగా అమలు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
రెండేళ్లుగా పాఠశాలల్లోని ఆర్వో వాటర్ ప్లాంట్ల నిర్వహణకు నిధులు కేటాయించకుండా పూర్తిగా గాలికి వదిలేశారు. అవన్నీ క్రమంగా
మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. విద్యార్థులకు తిప్పలు
తెచ్చిపెట్టాయి. పాఠశాలల్లో తాగునీటి వసతి లేకపోవడంతో దాహం తీర్చుకునేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు.
కొన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో చిన్నపాటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల
సొంత ఖర్చులతో అరకొరగా బబుల్ వాటర్ ఏర్పాటు చేస్తున్నారు. అధిక సంఖ్యలో పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సురక్షితం కాని ఏదోక నీటిని విద్యార్థులు తాగుతున్నారు. కూటమి ప్రభుత్వం
ఆర్భాటపు ప్రచారాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ.. ప్రభుత్వ
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తుండటంతో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల గొంతెండుతున్నా పట్టించుకోరా..? అంటూ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సురక్షితం కాని నీరు తాగి విద్యార్థులు
అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ
ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని,
పాఠశాలల్లోని ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లకు మరమ్మతులు
చేయించి విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


