నకిలీ డీఎస్పీ లీలలెన్నెన్నో..! | - | Sakshi
Sakshi News home page

నకిలీ డీఎస్పీ లీలలెన్నెన్నో..!

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

నకిలీ డీఎస్పీ లీలలెన్నెన్నో..! బైకుల చోరీ కేసుల్లో నిందితునికి జైలు శిక్ష

ఒంగోలు టౌన్‌: అతడి స్వగ్రామం చిలకలూరిపేట మండలం యడవల్లి. తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయ కూలీ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయో చొరవ అతడి సొంతం. అదే పెట్టుబడిగా నేరాలకు పాల్పడ్డాడు. అతడే కొత్తపల్లి ప్రదీప్‌. ఒంగోలు మండలం ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన ముంగులూరి రఘుపతి ఫిర్యాదుతో అతడి అసలు రంగు బయటపడింది. ఒక సైబర్‌ నేరంలో 1.23 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న రఘుపతి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసుల నుంచి తగిన స్పందన లభించలేదు. ఈ క్రమంలో అతడికి కొత్తపల్లి ప్రదీప్‌ పరిచమయ్యాడు. సైబర్‌ డీఎస్పీగా పనిచేస్తున్నట్లు చెప్పుకున్న అతగాడు.. రఘుపతి పోగొట్టుకున్న నగదు తిరిగిప్పిస్తానని నమ్మబలికాడు. బదులుగా రఘుపతి నుంచి రూ.5 లక్షల నగదు, ఒక బుల్లెట్‌ వాహనం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒట్టిచేతులు చూపడంతో అనుమానం వచ్చిన రఘుపతి విచారించగా.. ప్రదీప్‌ మోసం తెలిసి బిత్తరపోయాడు. పోలీసులతో ఉన్న సాన్నిహిత్యంతో మోసాలకు పాల్పడుతున్నట్లు రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నకిలీ డీఎస్పీగా పలువురిని మోసం చేసిన కొత్తపల్లి ప్రదీప్‌పై ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో ప్రదీప్‌ మోసాలపై చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తపల్లి ప్రదీప్‌కు పోలీసుల నుంచి ఎనలేని ప్రోత్సహం లభించింది. ప్రకాశం జిల్లాలోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సైబర్‌ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులకు కొత్తపల్లి ప్రదీప్‌ను ముఖ్య అతిథిగా పిలిచి పెద్ద పీట వేశారు. దాంతో క్షేత్రస్థాయి పోలీసులలో అతడికి క్రేజ్‌ ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకుని అతడు బరితెగించాడు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆన్‌ గవర్నమెంటు డ్యూటీ.. సైబర్‌ క్రైం అనే నేమ్‌ బోర్డు ఉన్న ఇన్నోవా వాహనంలోనే ప్రయాణించేవాడు. టోల్‌ గేట్ల వద్ద పోలీసు హారన్‌ ఉపయోగించి ఎలాంటి రుసుం చెల్లించకుండానే ప్రయాణించేవాడని తెలుస్తోంది. ప్రముఖ దేవాలయాలలో అత్యంత సులువుగా వీఐపీ దర్శనం చేసుకునేవాడని సమాచారం. తెరవెనుక అతడి నేర చరిత్ర మరోలా ఉంది. క్రికెట్‌ బెట్టింగులు, సైబర్‌ నేరాలు చేసేవాడని ప్రచారం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఇంటెలిజెన్స్‌ శాఖ, స్పెషల్‌ బ్రాంచి పోలీసులు అతడిని పసిగట్టలేకపోవడంపై పోలీసులలో విస్మయం వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణ పూర్తయితే ఇంకెన్ని నేరాలు బయటపడతాయో వేచిచూడాలి.

మార్కాపురం: పట్టణ పోలీసుస్టేషన్ల పరిధిలో మూడు బైకుల చోరీ కేసుల్లో నేరం రుజువుకావడంతో నిందితుడైన పిక్కిలి చంటికి ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ మార్కాపురం అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్టు క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎం.బాలాజీ సోమవారం తీర్పు చెప్పినట్లు పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి తెలిపారు. గతేడాది జవహర్‌నగర్‌ కాలనీలోని కె.రమేష్‌బాబు, జగదీశ్వరీహాలు వద్ద ఉన్న పఠాన్‌ఉమర్‌ఖాన్‌, విద్యానగర్‌కు చెందిన టి.రామాంజనేయరెడ్డిల బైకులు దొంగతనానికి గురయ్యాయి. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించిన స్థానిక పోలీసులు.. బండ్లమోటు పొలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో నిందితునిగా ఉన్న దోర్నాల మండలం హసానబాద్‌కు చెందిన పిక్కిలి చంటిని పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువుకావడంతో నిందితునికి జడ్జి శిక్ష విధించారు. ఈ కేసును అప్పటి ఎస్సై సైదుబాబు, ప్రస్తుత ఎస్సై విశ్వనాథరెడ్డి పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement