ఒంగోలు టౌన్: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయి. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలడిగి తెలుసుకున్నారు. చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితుల ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారితో ఫోన్లో మాట్లాడారు. త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. మీ కోసంలో భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ శ్రీహరి, అద్దంకి టౌన్ సీఐ సుబ్బరాజు, ఎస్సైలు పాల్గొన్నారు.
మార్కాపురంలో 34 ఫిర్యాదులు...
మార్కాపురం: పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఓఎస్‌డీ నవజ్యోతి మిశ్రా సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 34 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఫిర్యాదుదారుల అర్జీలను ఓఎస్‌డీ స్వయంగా స్వీకరించి సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. మార్కాపురం, యర్రగొండపాలెం సీఐలు అల్తాఫ్ హుస్సేన్, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.


