కంభం: తేరాతేజి (గరికతొక్కుడు) పండుగ సందర్భంగా సోమవారం కంభం చెరువుకట్టపై కోలాహలం నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు కుటుంబ సమేతంగా భారీగా కంభం చెరువు కట్టకు చేరుకున్నారు. నూతన దంపతులు కంభం చెరువులో వారి పెళ్లినాటి దండలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో మంది సరదాగా గడిపారు. పిల్లలు, నూతన జంటలు సెల్ఫీలు తీసుకుంటూ చెరువు కట్టపై సందడి చేశారు. ఇంటి వద్ద తయారు చేసి తెచ్చుకున్న వంటకాలను పిల్లాపాపలతో కలిసి కట్టపై కూర్చుని ఆరగించారు. కట్టపై ఉన్న దీనాషావళి దర్గా వద్ద కొబ్బరికాయలు, బూందితో ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు భక్తులు దర్గాపై చాదర్‌లు కప్పి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కట్టపైకి వచ్చిన ప్రజలకు కూలింగ్ వాటర్ అందజేశారు. కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కట్టపై వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. సాయంత్రం సూర్యాస్తమయంలో కంభం చెరువు అందాలు సందర్శకులను ఆహ్లాదపరిచాయి.


