రెవెన్యూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి | - | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి

Jul 28 2026 5:11 AM | Updated on Jul 28 2026 5:11 AM

మార్కాపురం టౌన్‌:

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ఈ విభాగంలో సమస్యల పరిష్కారం తక్కువగా ఉందని కలెక్టర్‌ విజయసునీత అన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటి నుంచైనా నిర్లక్ష్యం వీడి సమస్యల పరిష్కారంపై దృష్టిపెడితే జిల్లాకు మంచిపేరు వస్తుందన్నారు. ఆ దిశగా అధికారులు కృషిచేయాలన్నారు. మొత్తం 286 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూకు సంబంధించి 134, ఇతర సమస్యలపై 152 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు శివరామిరెడ్డి, అజయ్‌కుమార్‌, రవాణాశాఖాధికారి ఆర్‌ రాంబాబు, జిల్లా వ్యవసాయాధికారి బాలాజీనాయక్‌, లీడ్‌బ్యాంకు మేనేజర్‌ షాహీర్‌, మున్సిపల్‌ కమిషనరు నారాయణరావు, ఆర్టీసీ డీఎం లావణ్య, పలు శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయండి:

మార్కాపురం పట్టణానికి చెందిన రాచమడుగు తిరునారాయణమూర్తి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు నరసింహాపురం గ్రామ రెవెన్యూ ఇలాఖాలో ఉన్న తమ పొలాలను తమకు తెలియకుండా తమ సోదరుడు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని, వాటిపై విచారణ జరిపి ఆన్‌లైన్‌ రద్దుపరిచి న్యాయం చేయాలని పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించారు. 1989 జూలై 11న తమ తల్లిదండ్రులు సోదరులందరికీ ఆస్తి పంపకాలు రాశారన్నారు. అయితే తమకు తెలియకుండా సోదరుడు తమ పొలాలను కూడా రిజిస్టరు చేయించుకుని అన్యాక్రాంతం చేశారని ఫిర్యాదు చేశారు.

నా కొడుకు అన్నం పెట్టడం లేదయ్యా...

తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని కుమారుడు తనపేరును రాయించుకుని ఇప్పుడు అన్నంకూడా పెట్టడంలేదని కంభం మండలం కందులాపురం గ్రామానికి చెందిన చింతగుంట్ల నాగేంద్రమ్మ కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చింది. ఇదే విషయమై తాను ఈఏడాది మార్చి 3వ తేదీన అర్జీ ఇవ్వగా, ఆర్డీఓ, తహశీల్దార్‌ తన కుమారుడిని పిలిపించి మాట్లాడటంతో బాగా చూసుకుంటానని చెప్పాడని, కొద్దిరోజుల తరువాత మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాడని ఆమె తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్‌ను కోరారు. ఇదే విషయమై తాను ఈనెల 18 కంభంలో జరిగిన గ్రీవెన్స్‌లో కూడా అర్జీ ఇచ్చానని, ఇప్పటికై నా తనకు న్యాయం చేయాలని విన్నవించారు.

ఆర్‌ఆర్‌ ప్యాకేజీలో నాపేరు చేర్చండి..

వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా తమ గ్రామం ముంపునకు గురవుతుందని, ఆర్‌ఆర్‌ ప్యాకేజీ సర్వే సమయంలో తాము జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల్లో ఉండటం వలన తమ పేరు ప్యాకేజీలో చేర్చలేదని పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన దర్శనం మేరీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరు జాబితాలో చేర్చి నష్టపరిహారం అందించాలని కోరారు.

ఆన్‌లైన్‌లో మా పేర్లు నమోదు చేయండి:

వారసత్వంగా వచ్చిన తన పొలాలను తనపేరుపై ఆన్‌లైన్‌ చేయాలని గోగులదిన్నె గ్రామానికి చెందిన చిలుకూరి జగన్మోహన్‌రెడ్డి పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు. ఈ సమస్యపై తాను గతంలోనే అర్జీలు ఇచ్చారని తెలిపారు

ఒంగోలులో 308 అర్జీలు...

ఒంగోలు సబర్బన్‌: మీ కోసం కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కారంపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్‌ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, డీఆర్‌ఓ పి.వెంకటరమణ, డిప్యూటీ కలెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి మాధురి, డీపీఓ అనుపమ తదితర అధికారులతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 308 అర్జీలు రాగా, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అర్జీదారుల్లో సంతృప్తి స్థాయిని పెంచే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పలువురు లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను కలెక్టర్‌ అందజేశారు. తొలుత దివ్యాంగుల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

కలెక్టర్‌ విజయసునీత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement