ఈవీఎం గోదాముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోదాముల పరిశీలన

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

ఈవీఎం గోదాముల పరిశీలన అర్జీలను గడువు లోగా పరిష్కరించాలి విద్యార్థులపై లాఠీచార్జి దుర్మార్గం బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి అవయవదానం

ఒంగోలు సబర్బన్‌: నగరంలోని భాగ్యనగర్‌ ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్‌ పి.రాజాబాబు సోమవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా సందర్శించి గోదాం షట్టర్లకు వేసిన తాళాలు, సీల్‌ను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కల్పిస్తున్న భద్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఆర్‌ఓ పీవీ రమణ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఉన్నారు.

మార్కాపురం: ప్రజల నుంచి వచ్చే అర్జీలను గడువు లోగా పరిష్కరించాలని ఓఎస్‌డీ నవజ్యోతి మిశ్రా అన్నారు. స్థానిక పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్‌క్రా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్రంగా విచారించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. ఫిర్యాదుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి ప్రత్యేక శ్రద్ధతో స్పందించి, వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సివిల్‌, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్‌, జాబ్‌ ఫ్రాడ్‌, అత్తరింటి వేధింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌, త్రిపురాంతకం సీఐ అస్సన్‌, టీవీ పల్లి ఎస్సై శివ బసవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ఒంగోలు టౌన్‌: పరీక్ష పేపర్ల లీకేజీలను నిరసిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి లాఠీచార్జి చేయించడం దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరాస్వామి ఖండించారు. లాఠీచార్జికి నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయం నుంచి సాయిబాబా గుడి వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు చౌరస్తాలో మానవహారం చేపట్టారు. మోదీ ప్రభుత్వం వచ్చాక బిజేపీ పాలిత రాష్ట్రాల్లో పరీక్ష పేపర్లు లీకవడం నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. లక్షలాది విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వారిని వెనకేసుకొని రావడం చాలా దారుణమన్నారు. విద్యార్థుల జీవితాలకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం వారి గొంతులు నొక్కేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులను ఉసిగొప్పి లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వినోద్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

ఘట్‌కేసర్‌: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను మృతుడి కుటుంబీకులు దానం చేసి మానవతను చాటుకున్నారు. ఘట్‌కేసర్‌ పోలీసుల వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధేనువకొండ గ్రామానికి చెందిన గుంజి శ్రీను (40) యాదాద్రి భువనగరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరులో తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న వెంకిర్యాలలో పనులు పూర్తి చేసుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా అవుషాపూర్‌ దీక్ష హోటల్‌ వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు వెంటనే బీబీగనర్‌ ఎయిమ్స్‌ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం విషమించి సోమవారం బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. దు:ఖ సముద్రంలో ఉన్నా సమాజ హితం కోసం మృతుడి భార్య గుంజి శ్రావణి, కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement