సంతనూతలపాడు: స్కూల్ బస్సు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన సంఘటన సోమవారం సంతనూతలపాడు మండలంలోని చిలకపాడు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వేములపాడు నుంచి ఒంగోలు వెళ్తున్న సరస్వతీ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో ఎనిమిది మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరిద్దరికి స్వల్ప గాయాలవగా, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన స్థలాన్ని ఎస్సై వేజెండ్ల అజయ్‌బాబు పరిశీలించారు.
వరుస బస్సు ప్రమాదాలతో ఆందోళన...
సంతనూతలపాడు మండలంలో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత శనివారం మద్దులూరు సమీపంలో అనకళ్లపూడి గ్రామం నుంచి మద్దులూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపక్కన బోల్తా పడింది. ఈ బస్సులో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండగా, మొత్తం 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మండలంలో సింగిల్ లైన్ రహదారుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


