ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులపై చట్టపరంగా విచారణ చేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసంలో ప్రజల నుంచి ఆయన నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన 90 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలు సావధానంగా విని సానుకూలంగా స్పందిచారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ ఫిర్యాదుదారుల వివరాలను తెలియజేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరంగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని, వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని కలిగించాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ రమేష్, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ప్యానెల్ అడ్వకేట్ బాలాజీ సింగ్, మీకోసం ఎస్సై యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ హర్షవర్థన్ రాజు


