గిరిజన మహిళలు, గర్భిణుల పాలిట ‘రక్తహీనత’ శాపం 8 నుంచి 6 శాతానికి పడిపోయిన హిమోగ్లోబిన్ ఆధార్‌కు లింక్ కాని ఫోన్ నంబర్లు.. అందని పౌష్టికాహారం అల్లాడుతున్న అభాగ్యులు.. కరువైన వైద్య సేవలు ప్రజారోగ్య రక్షణలో పాలకుల నిర్లక్ష్యం సుస్పష్టం
అడవి తల్లి
అడవితల్లి ఒడిలో ఉండే గిరిజన మహిళలు పౌష్టికాహారం అందక బలహీనపడుతున్నారు. తగినంత రక్తం లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత అధికంగా కనపడుతోంది. కాన్పుల సమయంలో రక్తం తక్కువై ఇబ్బందులు పడుతున్న సందర్భాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం కూడా సాంకేతిక కారణాలతో గర్భిణులకు అందడం లేదు. అడవిలో ఉండే ప్రాణాలు..
ఏమైనా అడిగేదెవరు..అన్నట్లు అధికారులెవరూ వారి ఊసే పట్టించుకోవడం లేదు.
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులను రక్తహీనత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా గర్భిణుల పాలిట ఇది పెనుశాపంగా మారుతోంది. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నట్లు సర్కారు చెబుతున్నా పౌష్టికాహారం మాత్రం వారి దరికి చేరడం లేదు. గిరిజన గూడేల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఆస్పత్రులు నిర్మిస్తున్నా నాడి పట్టే వైద్యులు కరువయ్యారు. అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్యం కోసం మైళ్ల కొద్దీ దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అరకొర వైద్య సదుపాయాలతో అల్లాడిపోతూ.. తీరా ఆస్పత్రులకు చేరేలోపే జరగరాని అనర్థాలు జరిగిపోతున్నాయి. దశాబ్దాలుగా గిరిజనులను పట్టిపీడిస్తున్న రక్తహీనత, మాతాశిశు మరణాలకు ముగింపు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ప్రాణాలు తీస్తున్న రక్తహీనత, విషజ్వరాలు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 82 గిరిజన గూడేల్లో ఏటా మలేరియా, అతిసారం, టైఫాయిడ్‌తో పాటు విషజ్వరాలు గిరిజనులను కాటేస్తూనే ఉన్నాయి. దీనికి తోడు అడుగడుగునా రక్తహీనత వారి ప్రాణాల మీదకు తెస్తోంది. గూడేల్లో చోటుచేసుకుంటున్న అధిక శాతం మాతాశిశు మరణాలకు ప్రధాన కారణం రక్తహీనతే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం.. సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హిమోగ్లోబిన్ 11 శాతానికి తగ్గకూడదు. గర్భిణుల్లో ఇది 12 శాతం ఉండాలి. కానీ, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని చెంచుల్లో ఇది 9 శాతం కంటే తక్కువే ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. గర్భిణుల్లో అయితే మరీ దారుణంగా 8 నుంచి 6 శాతమే ఉంటోంది. చింతల గూడేనికి చెందిన కుడుముల మంతమ్మ అనే మహిళకు కేవలం 3 శాతం హిమోగ్లోబిన్ ఉండటంతో ఇటీవల వైద్యులు రక్తం ఎక్కించి కాన్పు చేయాల్సి వచ్చింది. అలాగే జల్లా గురవమ్మకు 8 శాతం, తుమ్మలబైలుకు చెందిన భూమని లింగేశ్వరికి 7.6 శాతం మాత్రమే రక్తం ఉన్నట్లు నిర్ధారణ కావడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.
ఆధార్ లింక్ లేక.. అందని పౌష్టికాహారం
గిరిజన గర్భిణులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వాలు కోట్లు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు శూన్యంగా మారింది. ‘పోషణ్ ప్లస్’ పథకంలో భాగంగా యాప్‌లో పేరు నమోదైన గర్భిణులకు నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు నూనె, 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, కిలో రాగిపిండి, అరకిలో బెల్లం, అరకిలో ఖర్జూరాలు, అర కిలో చిక్కీలు, 5 లీటర్ల పాలు, 25 గుడ్లు పంపిణీ చేయాలి. కానీ ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం కాకపోవడంతో అంగన్‌వాడీల ద్వారా అందాల్సిన ఈ ఫలాలు చెంచులకు చేరడం లేదు. ఒక్క పెద్దదోర్నాల మండల పరిధిలోని పలు గిరిజన గూడేల్లో సుమారు 350 మందికి పైగా గిరిజన గర్భిణీలు ఉండగా, వారిలో సగం మందికి ఆధార్‌కు ఫోన్ నంబర్లు లింక్ కాలేదు. ఫలితంగా వారికి ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారం అందడం లేదు. గూడెం విడిచి బయటకు రాలేని అమాయక చెంచులకు ఆధార్ అనుసంధానంపై అధికారులు కనీస అవగాహన కల్పించడం లేదు. ఇప్పటికై నా అధికారులు కళ్లు తెరిచి, గిరిజన గర్భిణులను మండల కేంద్రాలకు తీసుకొచ్చి ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని, తద్వారా వారికి పౌష్టికాహారం, మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజనులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.


