● కూటమి నేతల బినామీల కోసమే రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ
● రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు.. రూ.1,500 కోట్లకే ధారాదత్తం వెనుక కుట్ర
● వైఎస్ జగన్ కలకు, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి చంద్రబాబు మంగళం
● ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమంటున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు
● పోర్టు పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో మహోద్యమానికి సై
ఉలవపాడు:
రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనుక దశాబ్దాల పోరాట చరిత్ర ఉంది. వైఎస్సార్ సీపీతో సహా ఎన్నో ప్రజా సంఘాలు ఈ పోర్టు కోసం ఉద్యమించాయి. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అడ్డంకులన్నీ అధిగమించి, రికార్డు సమయంలో దాదాపు 95 శాతం పనులు పూర్తి చేయించి ప్రారంభానికి సిద్ధం చేశారు. ప్రభుత్వమే ఈ పోర్టును నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు, ఈ ప్రాంత వాసులకు వేలాదిగా ఉద్యోగాలు లభిస్తాయని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది. 2014–2019 మధ్య కాలంలో కేంద్రం నిధులిస్తానన్నా నిర్లక్ష్యం చేసి, తీరా 2019 ఎన్నికల ముందు ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ‘బుల్లి పోర్టు’కు కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకొన్న బాబు.. ఇప్పుడు ఏకంగా పోర్టును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే దుర్మార్గపు కుట్రలకు పదునుపెట్టారు.
దోపిడీకి పక్కా స్కెచ్..
టెండర్ల ముసుగులో హైడ్రామా
తొలిదశలో 850.79 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సుమారు రూ.5 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం జరిగింది. ఇంతటి భారీ ఆస్తిని కూటమి సర్కారు నిస్సిగ్గుగా తమ అనుకూల కార్పొరేట్ సంస్థలకు, టీడీపీ బినామీలకు కట్టబెట్టేందుకు టెండర్ల ముసుగులో నాటకమాడుతోంది. తొలిదశ పోర్టు నిర్వహణతో పాటు విస్తరణ పనుల పేరుతో 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ.. ఆ తర్వాత దాన్ని మరో 20 ఏళ్లు పొడిగించుకునేలా (మొత్తం 50 ఏళ్లు) ప్రైవేటు వ్యక్తులకు రాసిచ్చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన ఈ పోర్టును కేవలం రూ.1500 కోట్ల ‘ఆఫ్ ప్రీమియం’ ధరకే కట్టబెడుతుండటం కూటమి ప్రభుత్వ అవినీతికి, బరితెగింపునకు నిదర్శనం. ఆ రూ.1500 కోట్లు కూడా ఒకేసారి కట్టాల్సిన పనిలేదు. ముందుగా రూ. 750 కోట్లు చెల్లించి, మిగతా మొత్తం తీరికగా పది వాయిదాల్లో కట్టుకోవచ్చని టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొనడం చూస్తుంటే.. దీని వెనుక ఎంతటి భారీ ’క్విడ్ ప్రో కో’ దాగి ఉందో ఇట్టే అర్థమవుతోందని విశ్లేషకులు మండిపడుతున్నారు.
పొట్ట చేతబట్టి.. వలస పోవాల్సిందేనా?
పోర్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నిరుద్యోగ యువతకు వేలాదిగా ఉద్యోగాలు వస్తాయని, పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ప్రజలు ఎంతో ఆశపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు ఉంటే రిజర్వేషన్ల ద్వారా స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కేవి. కానీ, ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తుండటంతో స్థానికుల ఉపాధి ఆశలపై చంద్రబాబు సర్కారు నిలువునా నీళ్లు చల్లింది. ప్రైవేటు యాజమాన్యాలు ఏ పొరుగు రాష్ట్రం వారినో తీసుకొచ్చి ఇక్కడ పనులు చేయించుకుంటే, మా పిల్లలు పొట్టచేత పట్టుకుని వలసలు పోవాల్సిందేనా? అని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పోర్టు పరిరక్షణకు వైఎస్సార్ సీపీ పోరుబాట
రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమ హక్కులను, ఉపాధి అవకాశాలను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్న ప్రభుత్వ తీరుపై దళిత, బహుజన, ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ దోపిడీని అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ నడుం బిగించింది. ప్రజాధనంతో నిర్మించిన పోర్టును ప్రభుత్వమే నిర్వహించాలని, స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పచ్చ నేతల దోపిడీ నుంచి రామాయపట్నం పోర్టును కాపాడుకునేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మరో మహోద్యమానికి ప్రకాశం, నెల్లూరు ప్రాంత ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అస్మదీయుల కోసం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వ మెడలు వంచుతామని వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు.
రామాయపట్నంలో ‘బాబు’ తాబేదార్ల లంగరు
హక్కులు కాలరాస్తున్నారు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 95 శాతం పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ చర్య. ఇది స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల చేతగానితనానికి నిదర్శనం. పోర్టును ప్రభుత్వమే నిర్వహిస్తే పారిశ్రామికాభివృద్ధి జరిగి పేదలకు ఉపాధి లభిస్తుంది. ప్రైవేటీకరణను తక్షణమే ఆపకపోతే కేసులు, జైళ్లకు వెరవకుండా పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం.
– బుర్రా మధుసూదన్ యాదవ్, వైఎస్సార్ సీపీ కందుకూరు ఇన్‌చార్జ్


