20లోగా ఎన్‌పీసీఐ లింకేజ్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

20లోగా ఎన్‌పీసీఐ లింకేజ్‌ తప్పనిసరి

Jul 18 2026 9:33 AM | Updated on Jul 18 2026 9:33 AM

20లోగా ఎన్‌పీసీఐ లింకేజ్‌ తప్పనిసరి ఎరువుల పంపిణీపై కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి టైరు పేలి కారు బోల్తా.. ఏడుగురు జూదరుల అరెస్టు

ఒంగోలు వన్‌టౌన్‌: పదో తరగతి పాసై ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు జమకానున్నాయని, ఇందుకు విద్యార్థులు తమ బ్యాంకు లేదా పోస్టల్‌ ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్‌, ఎన్‌పీసీఐ అనుసంధానం చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్‌.లక్ష్మానాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్‌ లింక్‌ చేసిన బ్యాంకు ఖాతా కాపీని గ్రామ, వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు అందజేసి ఎన్‌పీసీఐ పోర్టల్‌లో మ్యాపింగ్‌ చేయించుకోవాలన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింక్‌ కానివారు వెంటనే పోస్టాఫీసులో కొత్త ఖాతా తెరిచి.. ఈ నెల 20లోగా ఎన్‌పీసీఐ అనుసంధానం పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఇన్‌చార్జి జేడీఏ బాలాజీనాయక్‌

మార్కాపురం: జిల్లాలో ఎరువుల పంపిణీ, అక్రమాల నియంత్రణకు ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయాధికారి బాలాజీ నాయక్‌ శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 21 మండలాలకు చెందిన రైతులు ఎరువుల సమస్యలపై 92810 65282 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జూన్‌ 8వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే), ప్రైవేట్‌ డీలర్ల వద్ద యూరియా, డీఏపీ ఎరువులను తప్పనిసరిగా యాప్‌ ద్వారానే పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు. రైతులు సాగు చేసిన పంట ఆధారంగా, శాస్త్రవేత్తల సిఫార్సు మేరకే ఎరువులు అందజేస్తామన్నారు. వ్యాపారులు ఎరువులు ఇవ్వకపోయినా, అధిక ధరలకు విక్రయించినా, ఇతర మందులు కొనాలని బలవంతపెట్టినా వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఆర్‌ఎస్‌కేలలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. వివరాలకు స్థానిక వ్యవసాయ అధికారి లేదా ఆర్‌ఎస్‌కే సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

సింగరాయకొండ: మండలంలోని పాకల రైల్వేగేటు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి(45) దుర్మరణం పాలయ్యాడు. ఒంగోలు జీఆర్పీ ఎస్సై శ్రీరామ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ వైపు వెళ్తున్న షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి ఒంటిపై, చేతిపై ’కుసుమ’ అనే పచ్చబొట్లు ఉన్నాయి. గులాబీ, బ్లూ, తెలుపు రంగుల అడ్డపట్టీల కాలర్‌ టీషర్టు, నిలువు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వివరాలు తెలిసిన వారు 9247575632 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

సీఎస్‌పురం: మండలంలోని కోవిలంపాడు వద్ద 167బీ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం కారు బోల్తాపడిన ఘటనలో ఓ ప్రధానోపాధ్యాయుడికి గాయాలయ్యాయి. పామూరుకు చెందిన బైరెడ్డి వెంగళరెడ్డి డీజీపేట ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని కారులో తిరిగి వెళ్తుండగా కోవిలంపాడు వద్ద ఒక్కసారిగా పిల్లలు అడ్డువచ్చారు. వారిని తప్పించే క్రమంలో కారును పక్కకు తిప్పగా ఫుట్‌పాత్‌ను ఢీకొట్టి, ముందు టైరు పేలి రోడ్డుపై బోల్తా కొట్టింది. కారులో ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయనకు తల, ఛాతీకి గాయాలు కాగా 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి పామూరు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సీఎస్‌పురం ఎస్సై పి.వెంకటేశ్వరరెడ్డి పరిశీలించి విచారణ చేపట్టారు.

రూ.1.30 లక్షల నగదు,

7 బైక్‌లు స్వాధీనం

జరుగుమల్లి(సింగరాయకొండ): మండలంలోని నందనవనం గ్రామ పంచాయతీ పరిధిలోని పొలాల్లో గురువారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై భాగ్యరాజ్‌ తమ సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. నిందితుల నుంచి రూ.1,30,200 నగదు, 7 బైక్‌లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement