సింగరాయకొండ: లాకప్ డెత్‌లతో రాష్ట్రస్థాయిలో వివాదాస్పదంగా మారిన కృష్ణలంక పోలీసుల్లాగా వ్యవహరించవద్దని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు న్యాయం చేయాలని సింగరాయకొండ ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్‌ను మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. మసీదు నిర్మాణ వివాదంలో వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ సుల్తాన్‌పై అక్రమంగా కేసు నమోదు చేసి, స్టేషన్‌లో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైను నిలదీశారు. ప్రజాస్వామ్యంలో పోలీసుల తీరు పక్షపాతంగా ఉండకూడదన్నారు. ‘వైఎస్సార్‌సీపీ వాళ్లు స్టేషన్‌కు రావద్దు.. కేవలం టీడీపీ వారికే న్యాయం చేస్తాం’ అని చెప్పడం దారుణమని, అలాంటప్పుడు పీఎస్ ముందు బోర్డు పెట్టుకోవాలని మండిపడ్డారు. ఒక సివిల్ వివాదానికి సంబంధించి క్రిమినల్ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. స్టేషన్‌కు వచ్చేవారి పట్ల అసభ్య పదజాలం వాడటం మానుకోవాలన్నారు. తాను అంత సులువుగా స్టేషన్ వరకు రానని, మళ్లీ రప్పించే ప్రయత్నం చేయవద్దన్నారు. అక్రమ కేసు నమోదుపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.
కుట్రపూరితంగానే కేసు: సుల్తాన్
ఈ ఘటనపై షేక్ సుల్తాన్ మాట్లాడుతూ.. పకీరుపాలెంలో మసీదు నిర్మాణం కోసం 2023లో సాజిద్ అనే వ్యక్తి 4 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చాడన్నారు. తాను కార్యదర్శిగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో బేస్‌మెంట్, పిల్లర్లు నిర్మించగా.. ఆ తర్వాత నిధుల లేమితో పనులు ఆగడంతో కమిటీ అధ్యక్షుడు దాదా.. శ్లాబ్ వరకు పూర్తి చేశాడన్నారు. అయితే మినార్ల నిర్మాణ విషయంలో ఇరువురి మధ్య తలెత్తిన చిన్న వాగ్వాదాన్ని సాకుగా చూపి దాదా.. తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని చెప్పారు. అంతేకాకుండా, దాత ఇచ్చిన స్థలంలో శ్లాబు వరకు నిర్మాణం జరిగినా.. అసలు ఎలాంటి కట్టడాలు జరగలేదని సాకు చూపి స్థల రిజిస్ట్రేషన్‌ను కుట్రపూరితంగా రద్దు చేయించారని సుల్తాన్ ఆరోపించారు. అనంతరం దాదాపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుల్తాన్ వర్గీయులు, ముస్లింలు ఎస్సైకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కేసును నిరసిస్తూ మాజీ మంత్రి డాక్టర్ సురేష్‌తో పాటు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌కు తరలివచ్చారు.
ఎస్సైకి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరిక
పార్టీలకతీతంగా న్యాయం చేయాలని హితవు


