● ఎల్‌నినో ప్రభావంతో నిలువునా ఎండుతున్న తోటలు
● చేసేదేమీ లేక చెట్లను నరికేస్తున్న రైతులు
కొనకనమిట్ల:
ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. వానలు లేక, ఎండల తీవ్రతకు కొనకనమిట్ల మండలంలో నిమ్మతోటలు నిలువునా ఎండిపోతున్నాయి. చినారికట్ల తదితర గ్రామాల్లో రైతులు సుమారు 600 ఎకరాల్లో నిమ్మ సాగు చేశారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోవడం, తోటలకు సరిపడా నీరు అందకపోవడంతో పచ్చని చెట్లు మాడిపోతున్నాయి. కళ్లెదుటే కాయలు కాసే చెట్లు ఎండిపోతుండటంతో కన్నీరు దిగమింగుకుంటూ రైతులు వాటిని గొడ్డలితో నరికేస్తున్నారు. తక్షణమే సకాలంలో వర్షాలు కురవకపోతే మిగిలిన తోటలకూ గొడ్డలివేటు తప్పదని, ఈ ఏడాది పెట్టుబడులు కూడా దక్కవని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


